ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి అర్ధాంగి కన్నుమూత

06-06-2021 Sun 14:18
  • అనారోగ్యంతో బాధపడుతున్న రాఘవమ్మ
  • హైదరాబాదులో ఈ ఉదయం మృతి
  • స్వస్థలం చిరుమామిళ్లలో విషాదఛాయలు
  • కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపిన సీఎం జగన్
AP Former CM Kasu Brahmananda Reddy wifer Raghavamma died

మాజీ ముఖ్యమంత్రి (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) కాసు బ్రహ్మానందరెడ్డి అర్ధాంగి రాఘవమ్మ కన్నుమూశారు. రాఘవమ్మ వయసు 97 సంవత్సరాలు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాదు సోమాజిగూడలోని తమ నివాసంలో రాఘవమ్మ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. రాఘవమ్మ మరణంతో ఆమె కుటుంబంలో విషాదం అలముకుంది. వారి స్వస్థలం గుంటూరు జిల్లా చిరుమామిళ్ల (నాదెండ్ల మండలం).

కాసు బ్రహ్మానందరెడ్డి అర్ధాంగి మృతి పట్ల ఏపీ సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

కాగా, కాసు బ్రహ్మానందరెడ్డి 1994లో కన్నుమూశారు. ఆయన వారసుడిగా కాసు కృష్ణారెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా వ్యవహరించారు. వైఎస్సార్ కు సన్నిహితుడైన కృష్ణారెడ్డి అప్పట్లో ఎంపీగానూ వ్యవహరించారు. కృష్ణారెడ్డి తనయుడు కాసు మహేశ్ ప్రస్తుతం గురజాల శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు. జగన్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా వైసీపీలో చేరారు.