హ‌రీశ్ రావు చేసిన విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టిన కిష‌న్ రెడ్డి

06-06-2021 Sun 13:17
  • వ్యాక్సిన్ల‌పై హరీశ్‌ రావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు
  • ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ కొరత ఉంది
  • తెలంగాణ కొనుగోలు చేసింది నాలుగున్నర లక్షల డోసులే
  • తెలంగాణ‌కు 75 లక్షల డోసులు కేంద్ర ప్ర‌భుత్వం ఉచితంగా ఇచ్చింది
kishan reddy slams harish rao

వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర స‌ర్కారు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లను కూడా కేంద్ర స‌ర్కారు కొనుక్కోనివ్వడం లేదని ఆయ‌న అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్య‌ల‌పై కేంద్ర హోం శాఖ స‌హాయ‌ మంత్రి కిషన్‌రెడ్డి  స్పందించారు.

ఈ రోజు ఆయన హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. వ్యాక్సిన్ల‌పై హరీశ్‌ రావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ కొరత ఉందని ఆయ‌న చెప్పారు. విదేశాల్లో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్‌ ఇక్కడికి రావడం లేదా? అని నిల‌దీశారు.

ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి కేంద్ర స‌ర్కారు వ్యాక్సిన్ల‌ను కొనుగోలు చేసి ఇస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు కొనుగోలు చేసింది నాలుగున్నర లక్షల డోసులేనని ఆయన చెప్పారు. తెలంగాణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం 75 లక్షల డోసులు ఉచితంగా ఇచ్చిందని కిషన్‌రెడ్డి తెలిపారు.