మహమ్మారి టైంలో అధికార వ్యామోహం.. అరాచకానికి దారి తీస్తుంది: ఉద్ధవ్​ ఠాక్రే

06-06-2021 Sun 11:06
  • బీజేపీపై నర్మగర్భ వ్యాఖ్యలు
  • ప్రజల ప్రాణ రక్షణకే విలువనివ్వాలని సూచన
  • తనకు సీఎం పీఠం లక్ష్యం కాదని కామెంట్
Lust For Power Amid Pandemic Will Lead To Anarchy says Uddhav Thackeray

బీజేపీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. మహమ్మారి సమయంలో అధికార వ్యామోహంతో రాజకీయాలకు పాల్పడడం అరాచకత్వానికి దారి తీస్తుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకే ఎక్కువ విలువనివ్వాలని సూచించారు. మరాఠీ డైలీ లోక్ సత్తా నిర్వహించిన ఆన్ లైన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు.

తనకు ప్రజలు ఎందుకు అధికారం కట్టబెట్టారో.. దానికి తానేం చేయాలో స్పష్టతనివ్వకుంటే ప్రజలు క్షమించరని అన్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలు బయటపడకుంటే తనకు అధికారం ఉండి ఏం లాభమన్నారు. తనకు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలన్న లక్ష్యమేమీ లేదని, శివసేన కార్యకర్తను ముఖ్యమంత్రిని చేయాలన్న తన తండ్రి బాల్ ఠాక్రే కలను నిజం చేయడమే తన లక్ష్యమని అన్నారు.

అసలు తనకు రాజకీయాల్లోకి రావాలనే లేదన్నారు. తన తండ్రికి సాయం చేసేందుకే వచ్చానన్నారు. వందేళ్లకోసారి వచ్చే ఇలాంటి మహమ్మారి టైంలో సీఎంను అయ్యానని చెప్పారు. బాధ్యతలను ఏనాడూ తప్పించుకోవాలనుకోలేదని చెప్పారు. ప్రమోద్ మహాజన్, గోపీనాథ్ ముండేల మరణంతోనే బీజేపీ, శివసేన మధ్య నమ్మకం సన్నగిల్లిందన్నారు.