ఆనంద‌య్య మందు పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

06-06-2021 Sun 11:00
  • రేప‌టి నుంచి పంపిణీ
  • ముందుగా సర్వేప‌ల్లిలో స‌ర‌ఫ‌రా
  • ఔష‌ధానికి ‘ఔషధచక్ర’ పేరు
anandaiah to distribute medicine

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనందయ్య త‌యారు చేస్తోన్న క‌రోనా మందు పంపిణీకి ఏర్పాట్లు పూర్త‌య్యాయి. రేప‌టి నుంచే మందు పంపిణీ చేస్తామని ఆనందయ్య తెలిపారు. ముందుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అందిస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఆ త‌ర్వాత మిగతా ప్రాంతాల్లో పంపిణీ చేయాలని నిర్ణయించామని తెలిపారు. అయితే, ఔష‌ధ‌ పంపిణీ కోసం రూపొందించిన వెబ్‌సైట్‌తో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని ఆయ‌న చెప్పారు. దీనిపై  రాజకీయాలు చేయ‌కూడ‌ద‌ని  ఆయ‌న చెప్పారు.

కాగా, ఈ ఔష‌ధానికి ‘ఔషధచక్ర’ అని పేరు పెట్టారు. ఆ మందు త‌యారీ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. కృష్ణ‌ప‌ట్నం పోర్టు వ‌ద్ద దీన్ని త‌యారు చేస్తున్నారు. ఇందుకోసం కృష్ణపట్నం పోర్టుకు చెందిన సీవీఆర్‌ కాంప్లెక్స్‌ను వాడుకుంటున్నారు. మొదట సర్వేపల్లి నియోజకవర్గంలో లక్షమందికి కరోనా రానివారు వాడే మందును అందజేయాలని ఆనంద‌య్య బృందం ఇప్ప‌టికే నిర్ణ‌యించింది. అనంత‌రం కరోనా రోగులకు అవసరమైన మందును పంపిణీ చేస్తారు. ఆ త‌ర్వాతే ఇతర ప్రాంతాల‌కు పంపిణీ చేయ‌నున్నారు.