కరోనాతో మరిన్ని రుగ్మతలు.. గుండె, మూత్రపిండాలకు నష్టం!

06-06-2021 Sun 10:00
  • 30 శాతం మంది రోగుల్లో వాసన సామర్థ్యం తగ్గడం, బలహీనత వంటి లక్షణాలు
  • న్యూరో సైకియాట్రిక్ లక్షణాలు అరుదు కాదంటున్న శాస్త్రవేత్తలు
  • నాడీ సంబంధ సమస్యలు భారంగా మారే అవకాశం ఉందని హెచ్చరిక
Covid impact on the brain and mind are varied and common

కరోనా వైరస్ మరిన్ని సమస్యలకు దారితీస్తున్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పటి వరకు ఇది ఊపరితిత్తులకు మాత్రమే హాని చేయగా, ఇప్పుడిది గుండె, మూత్రపిండాలను కూడా దెబ్బతీస్తోందని, చర్మంపై దద్దుర్లు, రక్తస్రావ సమస్యలు కూడా తలెత్తుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా ఉద్ధృతి కారణంగా పక్షవాతం, మెదడులోని ఇన్‌ఫ్లమేషన్, కండరాల రుగ్మతలకు సంబంధించిన కేసులు పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు పేర్కొన్నాయి.

కరోనా బారి నుంచి కోలుకున్న వారిలోనూ ఒత్తిడి, పొస్ట్ ట్రమాటిక్ డిజార్డర్ (పీటీఎస్‌డీ) వంటి సమస్యలు తలెత్తవచ్చని తొలినాటి అధ్యయనాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో తాజాగా బ్రిటన్ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేపట్టారు. ఈ సందర్భంగా 30 మంది రోగుల్లో వాసన సామర్థ్యం తగ్గడం, బలహీనత వంటి లక్షణాలు కనిపించినట్టు గుర్తించారు.

కరోనా రోగుల్లో న్యూరో సైకియాట్రిక్ లక్షణాలు అరుదేమీ కాదని పేర్కొన్నారు. కుంగుబాటు, ఆదుర్దా వంటి మానసిక సమస్యలు 25 శాతం మంది రోగుల్లో కనిపిస్తున్నట్టు పేర్కొన్నారు. మెదడుకు సంబంధించిన తీవ్రమైన రుగ్మతలు మాత్రం చాలా అరుదుగానే కనిపించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, నాడీ సమస్యలు మాత్రం బాధితులకు కొన్నేళ్లలో భారంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు.