బయోలాజికల్ ఇ నుంచి కార్బివాక్స్.. దేశంలోనే అత్యంత చవక!

06-06-2021 Sun 07:19
  • అమెరికా సంస్థతో కలిసి కార్బివాక్స్ అభివృద్ధి
  • కొనసాగుతున్న మూడో దశ ప్రయోగాలు
  • రెండు డోసులు కలిపి రూ. 500 మాత్రమే
Biological Es Corbevax May be Indias Cheapest COVID Vaccine

కరోనా వైరస్‌కు మరో టీకా అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఫార్మా సంస్థ బయోలాజికల్ ఇ.లిమిటెడ్ కార్బివాక్స్ పేరుతో టీకాను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం మూడో దశ ప్రయోగాల్లో ఉన్న ఈ టీకాను అత్యంత చవగ్గా అందించాలని సంస్థ నిర్ణయించింది. రూ. 500కే రెండు డోసులను అందించాలని, వీలైతే అంతకంటే తక్కువ ధరకే అందించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

అయితే, ధరను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అనుకున్నట్టుగా అదే ధరకు లభిస్తే దేశంలోనే అత్యంత చవకైన టీకా ఇదే కానుంది. అమెరికాకు చెందిన బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌తో కలిసి బయోలాజిక్ ఇ సంస్థ ఈ టీకాను అభివృద్ధి చేసింది. ఈ టీకాకు నిర్వహించిన మొదటి రెండు దశల ప్రయోగాల్లోనూ మెరుగైన ఫలితాలు వచ్చాయని, మూడో దశ ప్రయోగాలు కొనసాగుతున్నాయని సంస్థ పేర్కొంది.