హరియాణాకు టీకాలు అందించేందుకు మాల్టా సంస్థ ఆసక్తి!

05-06-2021 Sat 22:44
  • ఐరోపాలోని చిన్న ద్వీప దేశం మాల్టా
  • అక్కడి ఫార్మా రెగ్యులేటరీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ సంస్థ నుంచి ఆసక్తి
  • సుత్నిక్‌-వి టీకా పంపిణీ చేస్తామంటూ లేఖ
  • రాష్ట్రానికి నేరుగా టీకాలు  అందించేందుకు ఓ విదేశీ సంస్థ ముందుకు రావడం ఇదే తొలిసారి
a firm from Malta Interested to give sputnik vaccines to Haryana

ఐరోపాకు  చెందిన మాల్టా అనే చిన్న ద్వీప దేశం హరియాణాకు స్పుత్నిక్‌-వి టీకాలను అందించేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. ఆరు కోట్ల డోసులను అందిస్తామంటూ ముందుకు వచ్చింది. దేశంలోని ఓ రాష్ట్రానికి నేరుగా టీకాలు అందించేందుకు ఓ విదేశీ సంస్థ ముందుకు రావడం ఇదే తొలిసారి. మిగిలిన తయారీ సంస్థలు నేరుగా కేంద్రంతోనే ఒప్పందాలు చేసుకుంటామంటూ రాష్ట్రాలకు మొండిచేయి చూపించాయి.

మాల్టా రాజధానిలో ఉన్న ఫార్మా రెగ్యులేటరీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ సుత్నిక్‌-వి అందించేందుకు ఆసక్తి వ్యక్తం చేస్తూ హరియాణాకు లేఖ రాసింది. ఒక్కో డోసును రూ.1,120 అందజేస్తామని తెలిపింది. వ్యాక్సిన్ల సరఫరాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీకా తయారీ సంస్థల నుంచి హరియాణా ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానిస్తూ మే 26న ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి టెండర్లు అందే తేదీ శుక్రవారంతోనే ముగిసినప్పటికీ.. మాల్టా పంపిన ఆసక్తి వ్యక్తీకరణ లేఖను పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. టెండర్‌లో పేర్కొన్న అర్హతలు మాల్టా సంస్థకు ఉందో లేదో నిర్ధరించనున్నారు.

తొలి విడతలో భాగంగా 30 రోజుల్లో ఐదు లక్షల డోసులు అందిస్తామని.. తర్వాత ప్రతి 20 రోజులకు మిలియన్‌ డోసులు అందజేస్తామని మాల్టా సంస్థ స్పష్టం చేసినట్లు హరియాణా ప్రభుత్వం వెల్లడించింది. దేశ వ్యాప్తంగా టీకాల కొరత వేధిస్తున్న తరుణంలో మాల్టాలోని టీకా తయారీ సంస్థ నుంచి వచ్చిన స్పందన శుభపరిణామమనే చెప్పాలి.