Rupa Gurunath: చిక్కుల్లో పడిన తమిళనాడు క్రికెట్ సంఘం అధ్యక్షురాలు రూపా గురునాథ్

  • 2019లో టీఎన్ సీఏ అధ్యక్షురాలిగా ఎన్నిక
  • ఇండియా సిమెంట్స్ లో డైరెక్టర్ గా కొనసాగుతున్న రూపా
  • చెన్నై సూపర్ కింగ్స్ మాతృసంస్థ ఇండియా సిమెంట్సే!
  • రూప పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నట్టు గుర్తింపు 
  • డీకే జైన్ తన నివేదికలో వెల్లడి
TNCA President Rupa found guilty in conflict of interests

తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్ సీఏ) అధ్యక్షురాలు రూపా గురునాథ్ చిక్కుల్లో పడ్డారు. రూపా పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నట్టు బీసీసీఐ గుర్తించింది. తమిళనాడు క్రికెట్ సంఘం అధ్యక్షురాలిగా కొనసాగుతున్న ఆమెకు ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వెల్లడైంది.

 రూపా గురునాథ్ ఎవరో కాదు... బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ఇండియా సిమెంట్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అధినేత ఎన్. శ్రీనివాసన్ కుమార్తె. 2019 సెప్టెంబరులో తమిళనాడు క్రికెట్ సంఘం అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. దేశంలో ఓ మహిళ క్రికెట్ సంఘం అధ్యక్షురాలు కావడం అదే ప్రథమం.

ఆమె తన తండ్రికి చెందిన ఇండియా సిమెంట్స్ (ఐసీఎల్)లో డైరెక్టర్ గానూ వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్ (సీఎస్కేసీఎల్)తోనూ సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం మాజీ సభ్యుడు సంజీవ్ గుప్తా... బీసీసీఐ ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఇండియా సిమెంట్స్ కనుసన్నల్లోనే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కార్యకలాపాలు సాగిస్తోందని ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన రిటైర్డ్ జస్టిస్ డీకే జైన్ తన నివేదికలో పేర్కొన్నారు.

చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో తమకు వాటాలు లేవని ఐసీఎల్ వాదించినా, మేనేజ్ మెంట్ నుంచి ఫ్రాంచైజీ పాలనా వ్యవహారాల వరకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఐసీఎల్ తో ముడిపడి ఉన్నాయని డీకే జైన్ వివరించారు. ఈ క్రమంలో ఐసీఎల్ ప్రమోటర్లలో ఒకరైన రూపా గురునాథ్ కు కూడా చెన్నై సూపర్ కింగ్స్ తో సన్నిహిత సంబంధాలున్నట్టే భావించాలని వివరించారు. రూల్ 38 (2) నియమోల్లంఘన కింద బీసీసీఐ రాజ్యాంగాన్ని అనుసరించి చర్యలు ఉంటాయని జస్టిస్ డీకే జైన్ వెల్లడించారు.

More Telugu News