WHO: ఇక్కడ మరో వ్యాక్సిన్‌ కూడా తీసుకోవాల్సిందే!: భారతీయ విద్యార్థులకు అమెరికన్ వర్సిటీల ఆదేశాలు

  • కొవాగ్జిన్‌, స్పుత్నిక్‌-వి టీకాలకు డబ్ల్యూహెచ్‌ఓ అనుమతి లేదు   
  • డబ్ల్యూహెచ్‌వో గుర్తించిన టీకాలే వేసుకోవాలని సూచన
  • ఆందోళనలో భారత విద్యార్థులు
  • టీకాకు అపాయింట్‌మెంట్‌ దొరికే అవకాశం తక్కువ
American varsities ordering students to revaccinate those who had covaxin and sputnik vaccines

త్వరలో ప్రారంభం కానున్న సెమిస్టర్‌ విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన లేదా వెళ్లాలనుకుంటున్న భారత విద్యార్థులకు పెద్ద చిక్కే వచ్చి పడింది. ఇక్కడ కొవాగ్జిన్‌, స్పుత్నిక్‌-వీ టీకాలు తీసుకొని అక్కడికి చేరుకున్న వారు మరోసారి వేరే టీకా తీసుకోవాలని అక్కడి యూనివర్శిటీలు ఆదేశిస్తున్నాయి.

కొవాగ్జిన్‌, స్పుత్నిక్‌-వి టీకాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అనుమతి లభించకపోవడమే అందుకు కారణంగా తెలుపుతున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ అనుమతి పొందని టీకాల సామర్థ్యంపై కచ్చితమైన సమాచారం లేదని.. ఈ నేపథ్యంలో అమెరికాలో అందుబాటులో ఉన్న టీకాలను తీసుకోవాలని కోరుతున్నాయి.

దీంతో భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా రెండు టీకాలు తీసుకోవడం వల్ల ఏమైనా దుష్ప్రభావాలు తలెత్తుతాయేమోనని ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై స్పందించిన అమెరికా సీడీసీ అధికార ప్రతినిధి క్రిస్టెన్‌.. రెండు డోసులు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందన్న దానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధ్యయనాలు జరగలేదని తెలిపారు. అయితే, ఇప్పటికే ఏదైనా టీకా రెండు డోసులు తీసుకొని ఉంటే డబ్ల్యూహెచ్‌ఓ ధ్రువీకరించిన మరో వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకోవడానికి ముందు 28 రోజులు వేచి ఉండాలని సూచించారు.  

ఒకవేళ వర్సిటీలు సూచించినట్లుగా మరోసారి వ్యాక్సిన్‌ తీసుకుందామన్నా.. ఇప్పట్లో అపాయింట్‌మెంట్‌ దొరికే సూచనలు కనిపించడం లేదు. దీంతో తమ భవిష్యత్‌ ప్రణాళికపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరో వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేయడం వల్ల అమెరికా వర్సిటీల ఆదాయంపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి వర్సిటీలు ఏటా భారత విద్యార్థుల వల్ల 39 బిలియన్‌ డాలర్ల ఆదాయం సంపాదిస్తున్నాయి.

More Telugu News