Koo: 'కూ'... ట్విట్టర్ కు భారతీయ ప్రత్యామ్నాయం అవుతుందా?

  • భారత్ లో ట్విట్టర్ భవితవ్యంపై అనిశ్చితి
  • కేంద్రానికి, ట్విట్టర్ కు మధ్య పోరు
  • నైజీరియాలో ట్విట్టర్ పై నిషేధం
  • నైజీరియాలో తాము అందుబాటులో ఉన్నట్టు 'కూ' ప్రకటన
Koo set to enter Nigeria

భారత్ లో సోషల్ మీడియా నిబంధనలు కఠినతరం చేసిన నేపథ్యంలో ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ మెడపై కత్తి వేలాడుతోంది. తమ కొత్త నియమావళిని అంగీకరించాల్సిందేనని ట్విట్టర్ కు కేంద్రం చివరి అవకాశం ఇచ్చింది. అటు, ఆఫ్రికా దేశం నైజీరియా ట్విట్టర్ ను నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో, భారత సోషల్ నెట్వర్కింగ్ సైట్ 'కూ' మరోసారి తెరపైకి వచ్చింది.

ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా నిలిచేందుకు తీవ్రంగా కృషిచేస్తున్న 'కూ'... తాము ఇప్పుడు నైజీరియాలో అందుబాటులో ఉన్నామని ప్రకటించింది. ట్విట్టర్ నిషేధంతో ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేసేందుకు 'కూ' ఉత్సాహంగా ఉంది. నైజీరియాలో తమ రంగప్రవేశంపై 'కూ' వ్యవస్థాపకులు, సీఈఓ అప్రమేయ రాధాకృష్ణ స్పష్టత ఇచ్చారు.

స్థానిక భాషల్లోనూ సేవలు అందించాలన్నది తమ ప్రయత్నమని, ఈ క్రమంలో నైజీరియాలోనూ 'కూ' సేవలు అందుబాటులో ఉంటాయని రాధాకృష్ణ తెలిపారు. నైజీరియాలో ఇతర మైక్రోబ్లాగింగ్ సైట్లకు ఓ అవకాశం వచ్చిందని, దాన్ని సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. 'కూ' యాప్ లో నైజీరియా స్థానిక భాషలకు కూడా స్థానం కల్పిస్తామని పేర్కొన్నారు.

ట్విట్టర్ తరహాలోనే భావవ్యక్తీకరణకు ప్రాధాన్యత ఇచ్చే సామాజిక మాధ్యమంగా 'కూ' గతేడాది ప్రారంభమైంది. అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ బిదావట్కా కలిసి 'కూ'ని స్థాపించారు. ఇప్పుడిది తెలుగు, బెంగాలీ, హిందీ వంటి అనేక భాషల్లో అందుబాటులో ఉంది. 'కూ'కి ఇప్పటివరకు 60 లక్షల మంది యూజర్లు ఉన్నారు. దేశీయ మార్కుతో ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తిగా  కేంద్ర ప్రభుత్వం నూతన ఆవిష్కరణలను కోరుతోంది.

ట్విట్టర్ తో కొంతకాలంగా కేంద్రానికి పొసగడం లేదన్న నేపథ్యంలో, 'కూ' వంటి సైట్ల భవిష్యత్ పై కొత్త అంచనాలు ఏర్పడుతున్నాయి. ఒకవేళ కేంద్రం ట్విట్టర్ ను నిలిపివేస్తే 'కూ' వంటి సైట్లకు ప్రజాదరణ పెరుగుతుందనడంలో సందేహంలేదు. కాగా, 'కూ' ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ నూతన ఐటీ నియమ నిబంధనలను తాము పాటిస్తున్నామంటూ సంబంధిత వివరాలను సమర్పించింది. కేంద్రం నూతన నియమావళి తమకు సమ్మతమేనని పేర్కొంది.

More Telugu News