మమతా బెనర్జీ మేనల్లుడికి పార్టీలో ప్రమోషన్‌!

05-06-2021 Sat 18:46
  • కోల్‌కతాలో జరిగిన తృణమూల్‌ నాయకుల సమావేశం
  • పార్టీ ప్రధాన కార్యదర్శిగా అభిషేక్ నియామకం
  • అసెంబ్లీ ఎన్నికల గెలుపులో కీలక పాత్ర
  • గుర్తింపుగానే పార్టీలో ఉన్నత పదవి
  • అభిషేక్‌కు పార్టీపై పెరుగుతున్న పట్టు
Mamata Banerjee Nephew Gets Key Role In TMC

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్‌ బెనర్జీకి పార్టీలో కీలక పదవి కట్టబెట్టారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ శనివారం కోల్‌కతాలో జరిగిన సీనియర్‌ నాయకుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై ఘన విజయం సాధించిన తర్వాత పార్టీ తీసుకున్న తొలి కీలక నిర్ణయం ఇదే కావడం విశేషం.

ఎన్నికల్లో పార్టీ గెలుపులో అభిషేక్‌ కీలక పాత్ర పోషించినట్లుగా భావిస్తున్న నేపథ్యంలోనే ఆయనకు ఉన్నత పదవి లభించినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ను నియమించుకొని.. ఆయనతో పార్టీని సమన్వయపరచడంలో అభిషేక్‌ కీలకంగా వ్యవహరించినట్లు భావిస్తున్నారు.

ప్రధాన కార్యదర్శి పదవి వరించడంతో పార్టీలో ఆయన ప్రాబల్యం పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. వాస్తవానికి అభిషేక్‌కు పార్టీలో ప్రాధాన్యం పెరగడాన్ని జీర్ణించుకోలేకే.. ఎన్నికలకు ముందు మమత కుడి భుజంగా ఉన్న సువేందు అధికారి సహా మరికొంత మంది కీలక నేతలు పార్టీని వీడి కమలం గూటికి చేరారు.