చచ్చింది నా వాడా... నాకేం పని? అన్నట్టుగా కేసీఆర్ సారు తీరు ఉంది: షర్మిల విమర్శలు

05-06-2021 Sat 17:47
  • కేసీఆర్ ఒక కనికరం లేని వ్యక్తి
  • కేసీఆర్ పాలనలో పేదవాడికి రోగమొస్తే అప్పులే దిక్కు
  • కరోనా వైద్యులకు ఉచితంగా వైద్యం అందించాలి
KCR is inhuman person says YS Sharmila

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కనికరం లేని వ్యక్తి అని వైయస్ షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో పేదవాడికి రోగమొస్తే అప్పులే దిక్కని అన్నారు. అప్పులు చేసి లక్షలు కుమ్మరించినా ప్రాణం నిలుస్తుందన్న గ్యారంటీ లేదని విమర్శించారు. చచ్చింది నా వాడా... నాకేం పని అన్నట్టు కేసీఆర్ సారు తీరు ఉందని దుయ్యబట్టారు.

ఒకవైపు కన్నవారిని పోగొట్టుకుని దిక్కుతోచని స్థితిలో ఉంటూనే... మరోవైపు ఆస్తులను అమ్మినా అప్పులు తీర్చలేమనే ఆవేదన ఆ కుటుంబాలదని అన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి, ఉచితంగా వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అత్యధిక ఫీజులను వసూలు చేసిన కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి బాధితులకు డబ్బులను తిరిగి ఇప్పించాలని అన్నారు.