చంద్రబాబు, లోకేశ్ లేరు కాబట్టే ఏపీలో ముందే వర్షాలు పడుతున్నాయి: విజయసాయిరెడ్డి

05-06-2021 Sat 16:53
  • మరో నాలుగు నెలలు రాకపోతే భారీ వర్షాలు కురుస్తాయి
  • సొంతంగా గెలవలేమనే విషయం చంద్రబాబుకు అర్థమయింది
  • ప్రజలు ఈసడించుకుంటున్నా బాబుకు ఆశ చావడం లేదు
Vijayasai Reddy satires on Chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ లపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. తండ్రీకొడుకులు ఇద్దరూ ప్రస్తుతం పక్క రాష్ట్రంలో ఉన్నారని... అందుకే ఏపీలో ఈసారి ముందే వర్షాలు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. వారిద్దరూ కరువుకు మారుపేరని అన్నారు. మరో నాలుగు నెలల పాటు వారిద్దరూ ఇక్కడకు రాకపోతే రుతుపవనాలు భారీ వర్షాలను కుమ్మరిస్తాయని చెప్పారు.

ఏ ఎన్నికల్లో అయినా సొంతంగా గెలిచే సత్తా లేదనే విషయం చంద్రబాబుకు అర్థమయిందని విజయసాయి అన్నారు. 20 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న ఒక పార్టీ అధ్యక్షుడు ఎలాంటి షరతులు లేకుండా ఇంకో పార్టీకి మద్దతిస్తానని ప్రాధేయపడటం ఎక్కడా జరిగి ఉండదని విమర్శించారు. ప్రజలు ఈసడించుకుంటున్నా, బాబుకు ఆశ చావడం లేదని అన్నారు.

ఒక్క ఇటుకను కూడా పెట్టకుండానే అమరావతి గ్రాఫిక్స్ ను చూపిస్తూ చంద్రబాబు ఐదేళ్లు గడపేశారని విజయసాయి వ్యాఖ్యానించారు. జగన్ మాత్రం తాడిపత్రిలో 500 ఆక్సిజన్ బెడ్ల జర్మన్ హ్యాంగర్ హాస్పిటల్ ను 15 రోజుల్లోనే పూర్తి చేశారని అన్నారు. ప్రజల కోసం పని చేసే నాయకుడికి, పరాన్నజీవిలాంటి నాయుడికి ఇదే తేడా అని చెప్పారు.