రామ్ చరణ్ సరసన 'మాస్టర్' భామ?

05-06-2021 Sat 16:28
  • చరణ్, శంకర్ ల తొలి కాంబినేషన్
  • పాన్ ఇండియా మూవీగా నిర్మాణం
  • కథానాయికగా ప్రచారంలో పలు పేర్లు
  • తాజాగా మాళవిక మోహనన్ పేరు    
Malavika Mohanan to pair up with Charan

ఏ సినిమాకైనా హీరో తర్వాత ప్రాధాన్యత ఉండేది కథానాయికకే. అందులోనూ అసలు సినిమాకి గ్లామర్ అన్నది హీరోయిన్ వల్లే వస్తుంది. అందుకే, ఎప్పటికప్పుడు మన దర్శక నిర్మాతలు తమ తమ సినిమాలలో ఫ్రెష్ హీరోయిన్లను తీసుకుంటూవుంటారు.

ఇక స్టార్ హీరోలు నటించే సినిమాలకైతే ఈ ప్రాధాన్యత మరీనూ. హీరో స్టేచర్ కి తగ్గా అందగత్తె కావాలి. ముఖ్యంగా, అందాలు ఒలకబోయడంలో పరిమితులు పెట్టుకోని హీరోయిన్లకే ఎక్కువగా ఇటువంటి సినిమాలలో ఛాన్సులొస్తుంటాయి. అందుకే, స్టార్ హీరోల సినిమాలకు కథానాయిక ఎంపిక ఓ పట్టాన తెమలదు. ఇప్పుడు రామ్ చరణ్ నటించనున్న 15వ సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతోంది.

ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చరణ్ హీరోగా ఓ పాన్ ఇండియా చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్టుతో తెరకెక్కించనున్నారు. ఇక ఇందులో నటించే కథానాయిక విషయంలో ఇప్పటికే రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, ఇంతవరకు ఎవరూ ఖరారు కాలేదు.

ఈ క్రమంలో తాజాగా మాళవిక మోహనన్ పేరు వినిపిస్తోంది. ప్రముఖ ఛాయాగ్రాహకుడు కె.యు.మోహనన్ కూతురైన మాళవిక ఇటీవల తమిళ స్టార్ విజయ్ నటించిన 'మాస్టర్' సినిమాలో కథానాయికగా నటించింది. ఈ చిత్రం డబ్బింగ్ వెర్షన్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె పరిచయమైంది. చరణ్ పక్కన కథానాయిక పాత్రకు ప్రస్తుతం ఈ భామతో సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఏ విషయం వెల్లడవుతుంది.