ఓ డైరెక్టర్ నాతో దారుణంగా ప్రవర్తించాడు: బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్

05-06-2021 Sat 15:33
  • తొలి నాళ్లలో ఓ డైరెక్టర్ పరిచయం అయ్యాడు
  • సినిమా అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించే ప్రయత్నం చేశాడు
  • చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడు
One director misbehaved with me says Zareen Khan

సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఎంత దారుణంగా ఉంటుందో ఇప్పటికే పలువురు మహిళా ఆర్టిస్టులు తమ అనుభవాలను వెల్లడించారు. 'మీటూ' ఉద్యమం సమయంలో ఎందరో సినీ ప్రముఖుల భాగోతాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటుంది. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ తాను ఎదుర్కొన్న భయానక అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

ఓ కాల్ సెంటర్ లో పని చేస్తూ తాను బాలీవుడ్ అవకాశాల కోసం ప్రయత్నించానని... బాలీవుడ్ కు వచ్చిన తొలినాళ్లలో తనకు ఓ దర్శకుడు పరిచయం అయ్యాడని... ఎంతో మంచి వ్యక్తిలా తనతో మాట్లాడేవాడని జరీన్ తెలిపింది. ఓ సినిమాలో అవకాశం ఇప్పిస్తానని...  అందులో ముద్దు సన్నివేశం ఉంటుందని... దానికి ముందుగానే రిహార్సల్స్ చేద్దామని తనను పిలిచి, చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడని చెప్పింది.

తనను దారిలోకి తెచ్చుకునేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నించాడని తెలిపింది. సినిమా ఆఫర్లను తెప్పించే బాధ్యత తనదే అని చెపుతూ, తనను నమ్మించే ప్రయత్నం చేశాడని చెప్పింది. ఆ తర్వాత అతని బారి నుంచి తాను తప్పించుకున్నానని తెలిపింది. సల్మాన్ సరసన బాలీవుడ్ లో అరంగేట్రం చేసిన జహీర్ ఖాన్.. ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులో గోపీచంద్ సరసన తెరకెక్కిన 'చాణక్య' సినిమాలో కూడా నటించింది.