ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తేనే అది సాధ్యమవుతుంది: ఆనందయ్య సన్నిహితుడు సంపత్ రాజు

05-06-2021 Sat 14:29
  • ఆనందయ్యకు ఏపీ ప్రభుత్వం నుంచి తగిన  సహకారం లేదు
  • కృష్ణపట్నంలో ప్రస్తుతం సెక్షన్ 144 అమలు చేస్తున్నారు
  • ఆన్ లైన్ ద్వారా మందును సరఫరా చేయడం కుదరదు
No support for Anandaiah from AP govt

కరోనాకు ఆనందయ్య తయారు చేసిన నాటు మందు యావత్ దేశ దృష్టిని ఆకర్షించింది. ఆనందయ్యకు అండగా ఉంటామని వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు కూడా చెప్పారు. అయితే ఆనందయ్య సన్నిహితుడు సంపత్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం వైపు నుంచి తగిన  సహకారం లేదని ఆయన అన్నారు. ప్రాణాపాయ స్థితిలో వచ్చేవారికి మందు ఇవ్వలేక ఆనందయ్య కంటతడి పెట్టుకుంటున్నారని చెప్పారు.

కృష్ణపట్నంలో ప్రస్తుతం సెక్షన్ 144 అమలు చేస్తున్నారని తెలిపారు. మందు పంపిణీ జరగదని... దయచేసి ఎవరూ రావద్దని ప్రజలకు విన్నవించారు. ఆనందయ్య రోజుకు కేవలం 5 వేల మందికి సరిపడా మందును మాత్రమే తయారు చేయగలరని చెప్పారు. జిల్లాల వారీగా లక్షల మందికి మందును సరఫరా చేస్తామని ప్రభుత్వం చెప్పడం సరికాదని అన్నారు. ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తేనే అది సాధ్యమవుతుందని చెప్పారు. ఆన్ లైన్ ద్వారా మందును సరఫరా చేయడం కుదిరేపని కాదని స్పష్టం చేశారు.