ఆరెస్సెస్​ చీఫ్ మోహన్​ భగవత్​​ ఖాతా బ్లూ టిక్​ ను తీసేసిన ట్విట్టర్​

05-06-2021 Sat 14:07
  • మరో నలుగురు ప్రముఖుల ఖాతాలకూ తొలగింపు
  • కనీస సమాచారం లేదంటున్న ఆరెస్సెస్ వర్గాలు
  • వేరే వారి ఖాతాలకు ఎందుకు తీసేయట్లేదంటున్న నెటిజన్లు
Twitter Removes Blue Tick From RSS Chief Account

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ఖాతాలో బ్లూ టిక్ ను తొలగించిన ట్విట్టర్.. ఇప్పుడు ఆరెస్సెస్ సంస్థ మీద పడింది. ఆరెస్సెస్ అధిపతి మోహన్ భగవత్ ఖాతాకు బ్లూ టిక్ ను తీసేసింది. ఆయనతో పాటు మరో నలుగురు ఆరెస్సెస్ ప్రముఖుల ఖాతాల్లోనూ టిక్ మార్క్ ను తొలగించింది.

ఆరెస్సెస్ జాయింట్ జనరల్ సెక్రటరీలు కృష్ణగోపాల్, అరుణ్ కుమార్, జనరల్ సెక్రటరీ సురేశ్ భయ్యాజీ జోషి, సంపర్క్ ప్రముఖ్ అనిరుధ్ దేశ్ పాండేల ట్విట్టర్ ఖాతాకు బ్లూ మార్క్ ను తొలగించింది. బ్లూ మార్క్ ను తొలగించడానికి కారణం ఖాతాలను ఎక్కువ రోజులు వాడకపోవడమే అయితే దానికి కనీసం సమాచారమైనా ఇవ్వాలి కదా? అని ఆరెస్సెస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

ఆరు నెలల కన్నా ఎక్కువ కాలం పాటు వాడని ఖాతాలు ఎన్నో ఉన్నాయని, మరి, వారి ఖాతాలకు ఎందుకు బ్లూ టిక్ ను తీసేయట్లేదని నెటిజన్లు ట్విట్టర్ ను ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను పోస్ట్ చేస్తున్నారు.