హ‌నుమ జ‌న్మ‌స్థలంపై గోవిందానంద సరస్వతి వ్యాఖ్యలను కొట్టిపారేసిన టీటీడీ ఈవో జ‌వ‌హ‌ర్ రెడ్డి

05-06-2021 Sat 13:17
  • గోవిందానంద స‌రస్వ‌తి చూపిన ఆధారాలు స‌రిగ్గా లేవు
  • అంజ‌నాద్రే హ‌నుమంతుడి జ‌న్మ‌స్థ‌లం
  • త్వ‌ర‌లోనే అన్ని వివాదాలు స‌ద్దుమ‌ణుగుతాయి
  • హ‌నుమ జ‌న్మ‌స్థ‌లం గురించి  ఆధారాల‌ను ఇప్ప‌టికే చూపాం  
jawahar on hanuma birth place

ఆంజ‌నేయ స్వామి జన్మస్థలంపై టీటీడీ చెప్పిన విష‌యాల్లో నిజాలు లేవ‌ని, హడావుడిగా ప్రకటన చేసింద‌ని హనుమత్ జన్మతీర్థ ట్రస్ట్ వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై టీటీడీ ఈవో జ‌వ‌హ‌ర్ రెడ్డి స్పందించారు.

తిరుప‌తి క‌ర‌కంబాడి రోడ్డులో ఈ రోజు 10 వేల మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మంలో పాల్గొన్న జ‌వ‌హ‌ర్ రెడ్డి ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ... గోవిందానంద స‌రస్వ‌తి చూపిన ఆధారాలు స‌రిగ్గా లేవని అన్నారు. టీటీడీ త‌ప్పు చేస్తోంద‌న్న భావ‌న‌ ప్ర‌జ‌ల్లో క‌లిగేలా ఆయన మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు. అవ‌గాహ‌న లేకుండా కొంద‌రు ఏవేవో మాట్లాడుతుంటారని, వాటి గురించి స్పందించాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు.

అంజ‌నాద్రే హ‌నుమంతుడి జ‌న్మ‌స్థ‌ల‌మ‌ని జ‌వ‌హ‌ర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. త్వ‌ర‌లోనే అన్ని వివాదాలు స‌ద్దుమ‌ణుగుతాయ‌ని చెప్పుకొచ్చారు. హ‌నుమ జ‌న్మ‌స్థ‌లం గురించి త‌మ వ‌ద్ద ఉన్న ఆధారాల‌ను ఇప్ప‌టికే చూపామ‌ని తెలిపారు.