తమిళనాడులో లాక్​ డౌన్​ మరో వారం పొడిగింపు.. సడలింపులనూ ప్రకటించిన సర్కార్​

05-06-2021 Sat 12:10
  • జూన్ 14 వరకు లాక్ డౌన్
  • ప్రభుత్వ ఆఫీసుల్లో 30% సిబ్బందికి ఓకే
  • రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో రోజుకి 50 టోకెన్లకే అనుమతి  
Tamilnadu Extends Lockdown till June 14 with Relaxations

తమిళనాడు ప్రభుత్వం లాక్ డౌన్ ను మరో వారం పొడిగించింది. కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు నియంత్రణలోకి వచ్చినా.. మరింత కట్టడి చేసేందుకు లాక్ డౌన్ ను జూన్ 14 వరకు పొడిగిస్తున్నట్టు స్టాలిన్ సర్కార్ ప్రకటించింది. కరోనా కట్టడిపై అధికారులతో సమీక్ష చేసిన మరుసటి రోజే లాక్ డౌన్ ను పొడిగిస్తూ సర్కారు ఉత్తర్వులిచ్చింది.

లాక్ డౌన్ పొడిగింపుతో పాటు కొన్ని సడలింపులను ఇచ్చింది. చెన్నైకి మరిన్ని సడలింపులను ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే అనుమతించిన కార్యకలాపాలకు అన్ని జిల్లాల్లోనూ అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.

11 జిల్లాల్లో కరోనా కేసులు ఇంకా ఎక్కువగానే వస్తున్నా.. ప్రజల అవసరాల దృష్ట్యా ఆయా జిల్లాల్లోనూ సడలింపులను ప్రకటించింది. అందులో భాగంగా కిరాణా దుకాణాలు, కూరగాయలు, మాంసం, చేపల మార్కెట్లను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతించారు.

అన్ని ప్రభుత్వ కార్యాలయాలు 30 శాతం సిబ్బందితో నడిపేందుకు అనుమతించారు. రిజిస్ట్రేషన్ ఆఫీసులకూ ఓకే చెప్పినా.. ఒక రోజులో కేవలం 50 టోకెన్లకే పరిమితం చేశారు. చెన్నై వంటి సిటీల్లో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, హౌస్ కీపింగ్ ఏజెన్సీలకూ ఈ–రిజిస్ట్రేషన్ ద్వారా సేవలందించేందుకు అనుమతులిచ్చింది. ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, మోటార్ టెక్నీషియన్లు, కార్పెంటర్లూ పనులు చేసుకునేందుకు అనుమతినిచ్చింది. వాహన మెకానిక్ లకూ ఓకే చెప్పింది.

కాగా, కేసులు ఎక్కువగా ఉన్న నీలగిరులు, కొడైకెనాల్, ఎర్కాడ్, ఎళగిరి, కోర్తాలాలకు వెళ్లాలంటే జిల్లా కలెక్టర్ల నుంచి ఈ–పాస్ లను తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది.