ట్రంప్ ఖాతాలను రెండేళ్ల పాటు నిలిపివేసిన ఫేస్ బుక్

05-06-2021 Sat 08:50
  • సోషల్ మీడియాలో దురుసు వ్యాఖ్యల ఫలితం
  • ఇప్పటికే ట్రంప్ ఖాతా మూసేసిన ట్విట్టర్
  • జనవరి 7 నుంచే ఫేస్ బుక్ ఖాతాలపై నిషేధం
  • నిషేధాన్ని రెండేళ్లకు పొడిగించిన ఫేస్ బుక్
  • ఇది తన అభిమానులను అవమానించడమేనన్న ట్రంప్
Facebook suspends Donald Trump accounts for two years

అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన కాలంలో డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ఎంత దుందుడుకు వ్యాఖ్యలు చేసేవారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరిపైన అయినా, ఎంతటి వ్యాఖ్యలు చేసేందుకు అయినా ఆయన ఏనాడూ వెనుకాడింది లేదు. అయితే, ఇప్పుడు అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం ట్రంప్ ఖాతాను ట్విట్టర్ శాశ్వతంగా మూసేసింది.

ఇప్పుడు మరోసారి సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంది. ట్రంప్ ఖాతాలను రెండేళ్ల పాటు నిలిపివేసింది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లోని ఆయన ఖాతాలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని తెలిపింది. తమ నియమ నిబంధలను ట్రంప్ తీవ్రస్థాయిలో ఉల్లంఘించారని ఫేస్ బుక్ ఓ ప్రకటనలో పేర్కొంది. జనవరి 7నే ట్రంప్ ఖాతాల కార్యకలాపాలను అడ్డుకున్న ఫేస్ బుక్... ఈ తేదీ నుంచే తాజా నిషేధం అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

దీనిపై ట్రంప్ స్పందించారు. ఫేస్ బుక్ తన చర్య ద్వారా, గత ఎన్నికల్లో తనకు ఓటేసిన కోట్లమంది ప్రజలను అవమానించిందని పేర్కొన్నారు.