మృత్యు భయాన్ని తొలగిస్తున్న కరోనా వ్యాక్సిన్: ఎయిమ్స్ అధ్యయనం

05-06-2021 Sat 07:47
  • వ్యాక్సిన్ల పనితీరుపై ఎయిమ్స్ అధ్యయనం
  • సింగిల్ డోసు కూడా రక్షణ కల్పిస్తోందని వెల్లడి
  • తీవ్ర లక్షణాలు ఉండడంలేదని వివరణ
  • విషమ పరిస్థితులు కనిపించడంలేదన్న ఎయిమ్స్
AIIMS study found no mortality fears after getting vaccinated

వ్యాక్సినేషన్ అంశంపై ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) అధ్యయనం చేపట్టింది. వ్యాక్సిన్ల సామర్థ్యంపై ఈ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో సంతృప్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా సోకిన వాళ్లలో ఎలాంటి మరణాలు సంభవించలేదని ఎయిమ్స్ అధ్యయనం చెబుతోంది. వ్యాక్సిన్ తో కరోనా మృత్యుభయం ఉండదని గుర్తించారు.

టీకా పొందినప్పటికీ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినా, వారిలో ఏమంత తీవ్ర లక్షణాలు ఉండడంలేదని, విషమ పరిస్థితిగా భావించాల్సిన అవసరం కనిపించడంలేదని ఎయిమ్స్ పరిశోధకులు పేర్కొన్నారు. వ్యాక్సిన్ పొందిన 63 కరోనా రోగులపై ఈ అధ్యయనం చేపట్టారు. వారిలో 36 మంది రెండు డోసులు పొందగా, 27 మంది సింగిల్ డోస్ తీసుకున్నారు. వారిలో 53 మంది కొవాగ్జిన్, 10 మంది కొవిషీల్డ్ వేయించుకున్నారు.

కాగా, వారికి కరోనా సోకినప్పుడు పరీక్ష చేయగా, వారి శాంపిళ్లలో వైరల్ లోడ్ అధికస్థాయిలోనే కనిపించింది. వీరిలో వ్యాక్సిన్ తీసుకోని కరోనా రోగుల మాదిరే జ్వరం కూడా 5 నుంచి 7 రోజుల పాటు కనిపించినా, అదేమంత ఇబ్బంది పెట్టేంత స్థాయిలో లేదని గుర్తించారు.