గాన గంధర్వుడితో అరుదైన ఫొటో పంచుకున్న తమన్

04-06-2021 Fri 22:05
  • సియోల్ ఎయిర్ పోర్టులో ఎస్పీ బాలుతో తమన్
  • 1996లో అమెరికా వెళుతున్నప్పటి ఫొటో
  • నిక్కర్ వేసుకుని కనిపించిన తమన్
  • నాడు బాలు ట్రూప్ లో తానే డ్రమ్మర్ నని వెల్లడి
Thaman shared an rare photo of SP Balu

నేడు (జూన్ 4) గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి కావడంతో ఆయన స్మరణలో ప్రముఖులు బాధాతప్త సందేశాలను పోస్టు చేశారు. ఆ దిగ్గజ గాయకుడితో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగాలకు లోనయ్యారు. ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు తమన్ కూడా ఎస్పీ బాలు లేని లోటు పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "మిస్ యూ మామా" అంటూ తన ఆవేదన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా తమన్ ఓ ఆసక్తికరమైన ఫొటో పంచుకున్నారు.

దక్షిణ కొరియాలోని సియోల్ ఎయిర్ పోర్టులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో తమన్ కలిసి ఉన్నప్పటి ఫొటో అది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వెళుతుండగా ఆ ఫొటో తీసుకున్నట్టు తమన్ వెల్లడించారు. అది 1996 నాటి ఫొటో అని తెలిపారు. ఓ కచేరీ కోసం తాము అమెరికా వెళుతున్నామని, నాడు బాలసుబ్రహ్మణ్యం బృందంలో తాను అత్యంత పిన్నవయస్కుడైన డ్రమ్మర్ నని తమన్ పేర్కొన్నారు.