స్పుత్నిక్‌-వి కరోనా టీకా తయారీకి సీరం ఇన్‌స్టిట్యూట్‌కు డీసీజీఐ అనుమతి

04-06-2021 Fri 21:25
  • స్పుత్నిక్‌ను అభివృద్ధి చేసిన గమలేయా రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌
  • భారత్‌లో తయారీ, పంపిణీకి రెడ్డీస్‌ ల్యాబ్‌తో ఒప్పందం
  • తాజాగా గమలేయాతో సీరం భాగస్వామ్యం
  • ఈ టీకా తయారీకి అనుమతి పొందిన ఆరో సంస్థ సీరం
  • జులై నుంచి భారత్‌లో ప్రారంభం కానున్న ఉత్పత్తి
Serum Has been granted permission to manufacture Sputnik Vaccine

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి కరోనా వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతినిచ్చింది. అలాగే ఈ టీకా ప్రయోగాల పరిశీలన, పరీక్షలతో పాటు ఫలితాలను విశ్లేషించడానికి సైతం ఆమోదం తెలిపింది. గురువారం ఇందుకోసం డీసీజీఐకి సీరం దరఖాస్తు చేసుకోగా నేడే అందుకు అనుమతులు రావడం విశేషం.

ఈ మేరకు రష్యాకు చెందిన ‘గమలేయా రీసెర్చి ఇన్‌స్టిట్యట్‌ ఆఫ్‌ ఎపిడెమాలజీ అండ్‌ మైక్రోబయాలజీ’, పూణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌కు మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో భారత్‌లో స్పుత్నిక్‌ టీకా తయారీకి ముందుకు వచ్చిన ఆరో సంస్థ సీరం కావడం గమనార్హం. ఇప్పటికే హెటిరో బయోఫార్మా, గ్లాండ్‌ ఫార్మా, పనెషియా బయోటెక్‌, స్టెలిస్ బయోఫార్మా, విర్చో బయోటెక్‌ ఈ టీకా తయారీకి అనుమతులు పొందాయి.

రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) సహకారంతో గమలేయా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ను భారత్‌లో తయారీ, సరఫరా చేసేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌ వినియోగానికి ఏప్రిల్‌లోనే డీసీజీఐ అనుమతి ఇచ్చింది. జులై నుంచి భారత్‌లోనే తయారీ ప్రారంభం కానుంది. ఆలోపు రష్యా నుంచి స్పుత్నిక్‌-వి డోసులు దిగుమతి అవుతున్నాయి.