దర్శకుడ్ని పెళ్లాడిన బాలీవుడ్ నటి యామీ గౌతమ్

04-06-2021 Fri 21:18
  • ఆదిత్య ధర్ తో ఏడడుగుల బంధం
  • ముంబయిలో కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో వివాహం
  • ఉరి చిత్రం సందర్భంగా బలపడిన ప్రేమబంధం
  • తెలుగులోనూ పలు చిత్రాలు చేసిన యామీ గౌతమ్
Yami Gautam marries director Adithya Dhar

బాలీవుడ్ నటి, మోడల్ యామీ గౌతమ్ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించింది. యామీ గౌతమ్ 'ఉరి: ద సర్జికల్ స్ట్రైక్' చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్ ను పెళ్లాడింది. కరోనా నేపథ్యంలో కొద్దిమంది బంధుమిత్రుల నడుమ వీరి వివాహం ముంబయిలో జరిగింది. 'ఉరి' చిత్ర షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ బలపడింది. సినిమాలే కాకుండా, పలు వాణిజ్య ప్రకటనలతోనూ యామీ గౌతమ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ముఖ్యంగా 'గ్లో అండ్ లవ్లీ' (గతంలో ఫెయిర్ అండ్ లవ్లీ) యాడ్ తో ఆమె ఇప్పటికీ బుల్లితెరపై దర్శనమిస్తుంటుంది.

యామీ బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోనూ పలు చిత్రాలు చేసింది. 'యుద్ధం' చిత్రంలో తరుణ్ తోనూ, 'కొరియర్ బాయ్ కల్యాణ్' చిత్రంలో నితిన్ సరసన నటించింది. తెలుగులో ఆమె తొలి చిత్రం 'నువ్విలా'. ఆ తర్వాత 'గౌరవం' చిత్రంలో నటించింది.