జడ్జి రామకృష్ణకు మెరుగైన చికిత్స అందించాలి: గవర్నర్ కు లేఖ రాసిన రఘురామకృష్ణరాజు

04-06-2021 Fri 20:56
  • పీలేరు సబ్ జైల్లో ఉన్న జడ్జి రామకృష్ణ
  • జడ్జి మధుమేహంతో బాధపడుతున్నారన్న రఘురామ
  • తిరుపతి ఆసుపత్రికి తరలించాలని విజ్ఞప్తి
  • గవర్నర్ జోక్యం చేసుకోవాలని వినతి
MP Raghurama Krishna Raju wrote governor and seeking intervention into judge Ramakrishna health issues

ఎంపీ రఘురామకృష్ణరాజు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. చిత్తూరు జిల్లా పీలేరు జైల్లో ఉన్న జడ్జి రామకృష్ణ అనారోగ్యంతో బాధపడుతున్నందున, ఆయనకు మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరారు. జడ్జి రామకృష్ణ డయాబెటిస్, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నారని వివరించారు. జడ్జి కుటుంబ సభ్యుల ఆవేదనను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. జడ్జి రామకృష్ణను పీలేరు సబ్ జైలు నుంచి తిరుపతి ఆసుపత్రికి తరలించి, ఆయన ఆరోగ్యం కుదుటపడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

జడ్జి రామకృష్ణను భద్రతా కారణాల రీత్యా చిత్తూరు జైలు నుంచి పీలేరు సబ్ జైలుకు తరలించడం తెలిసిందే. తన తండ్రికి చిత్తూరు జైలులో ప్రాణహాని పొంచి ఉందని జడ్జి రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన నేపథ్యంలో ఈ తరలింపు జరిగింది.