రూ.43 వేల కోట్లతో భారీ రక్షణ ప్రాజెక్టు.. 6 జలాంతర్గాముల నిర్మాణానికి డీఏసీ ఆమోదం!

04-06-2021 Fri 19:39
  • నౌకాదళ పటిష్ఠతకు రక్షణ శాఖ కీలక నిర్ణయం
  • వ్యూహాత్మక భాగస్వామ్య మోడ్‌లో నిర్మాణం
  • తీరనున్న రాబోయే 30 ఏళ్ల అవసరాలు
  • ఎయిర్‌ డిఫెన్స్ గన్స్‌ కొనుగోళ్లకూ ఆమోదం
DAC Approved construction of 6 submarines indigineously

పొరుగుదేశాల నుంచి భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతున్న వేళ రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నౌకాదళ పటిష్ఠతను మరింత బలపరిచేలా కీలక చర్యలకు ఉపక్రమించింది. దేశీయంగా ఆరు అత్యాధునిక సంప్రదాయ జలాంతర్గాముల నిర్మాణానికి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన ‘డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌(డీఏసీ)’ అంగీకారం తెలిపింది. రూ.43 వేల కోట్లతో మేకిన్‌ ఇండియా పథకం కింద ఈ భారీ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

రాబోయే 30 ఏళ్లకు కావాల్సిన జలాంతర్గాముల నిర్మాణ అవసరాలు ఈ ఆరింటితో తీరనున్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ‘వ్యూహాత్మక భాగస్వామ్య మోడ్‌’లో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ విధానంలో దేశీయంగా ఇంతటి భారీ ప్రాజెక్టును చేపట్టడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. అయితే, ఈ ప్రాజెక్టు కింద నిర్మించనున్న తొలి జలాంతర్గామి భారత నేవీలో చేరడానికి కనీసం ఏడేళ్లు పట్టే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.  

ఈ ప్రాజెక్టుతో జలాంతర్గాముల తయారీలో స్వయం సమృద్ధి సాధించడంతో పాటు దిగుమతులపై ఆధారపడడం పూర్తిగా తగ్గనుందని ప్రభుత్వ ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. దీనితో పాటు మరికొన్ని కీలక రక్షణ సంబంధిత ప్రతిపాదనలకు డీఏసీ ఆమోదం తెలిపింది. పదాతిదళానికి కావాల్సిన అత్యాధునిక ఎయిర్‌ డిఫెన్స్‌ తుపాకుల కొనుగోలుకు సైతం అంగీకారం తెలిపింది. దీనికోసం రూ.6,000 కోట్లు కేటాయించనున్నట్లు పేర్కొంది.