అమూల్, ఏపీ ఒప్పందంపై రఘురామ పిటిషన్... మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

04-06-2021 Fri 19:28
  • అమూల్ తో ఏపీ సర్కారు ఒప్పందం
  • ఇది చట్టవిరుద్ధమన్న రఘురామ
  • రఘురామ పిటిషన్ పై నేడు విచారణ
  • ఈ నెల 14 వరకు నిధులు ఖర్చు చేయవద్దన్న కోర్టు
High court halts Amul and AP govt MoU

పాలు, పాల పదార్థాల సంస్థ అమూల్ తో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని సవాల్ చేస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. రఘురామ పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ జరిపింది. ఒప్పందం తాలూకు పూర్తి వివరాలు సమర్పించాలని నేషనల్‌ డెయిరీ బోర్డును, అమూల్ ను ధర్మాసనం ఆదేశించింది. ఒప్పందంపై ఈ నెల 14 వరకు నిధులు ఖర్చు చేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది.

ఏపీ డెయిరీ ఆస్తులను లీజు పద్ధతిలో అమూల్ సంస్థకు బదలాయించడం పట్ల రఘురామ తన పిటిషన్ లో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.

కాగా, ఇవాళ ఏపీ సీఎం జగన్ పశ్చిమ గోదావరి జిల్లాలో జగనన్న పాల వెల్లువ పథకానికి శ్రీకారం చుట్టారు. అమూల్ తో ఒప్పందం నేపథ్యంలో దీన్ని రాష్ట్రమంతటా విస్తరించనున్నారు. అయితే కోర్టు స్టే నేపథ్యంలో ప్రభుత్వ కార్యాచరణ తాత్కాలికంగా నిలిచిపోనుంది.