భీమవరంలో ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు కోరుతూ ప్రధానికి లేఖ రాసిన రఘురామకృష్ణరాజు

04-06-2021 Fri 19:11
  • ఆక్వా రంగంపై లేఖలో వివరణ
  • డెల్టా ప్రాంతంలో ఆక్వాసాగు ఎక్కువని వెల్లడి
  • 80 వేల కోట్ల ఎగుమతులు జరిపినట్టు వివరణ
  • మరింత అభివృద్ధికి వర్సిటీ అవసరమని ఉద్ఘాటన
  • భూములు కూడా అందుబాటులో ఉన్నాయన్న రఘురామ
MP Raghurama Krishna Raju wrote PM Modi for International Fisheries University

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలోని భీమవరంలో అంతర్జాతీయ సమీకృత మత్స్యకార విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని తన లేఖలో కోరారు. తన నియోజకవర్గం కృష్ణా-గోదావరి పరీవాహక ప్రాంతం కిందికి వస్తుందని, ఈ డెల్టా ఏరియా ఆక్వా సాగుకు ప్రసిద్ధి చెందిందని వెల్లడించారు. అందులోనూ, ఆక్వా రంగానికి భీమవరం ముఖ్య కేంద్రంగా నిలుస్తోందని వివరించారు.

ఇక్కడి నుంచి ఇప్పటికే 80 వేల కోట్ల విలువైన చేపలు, రొయ్యలు ఎగుమతులు జరిగాయని, 4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల ఎగుమతుల సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. అయితే, అందుకు అవసరమైన మార్గదర్శనం, నాయకత్వం, కొత్త విధానాలు, తగిన నైపుణ్యాల పెంపు, వనరుల లభ్యత తదితర అంశాల్లో ఆక్వా రంగానికి వ్యవస్థాగత మద్దతు అవసరమని అభిప్రాయపడ్డారు. అది ఇంటర్నేషనల్ ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటుతో సాకారమవుతుందని వివరించారు.

910 కిలోమీటర్ల పొడవున ఏపీకి విస్తృతమైన సముద్ర తీరప్రాంతం ఉందని, ఇప్పుడున్న నైపుణ్యాలతో రాష్ట్ర మత్స్యకారులు సముద్రంలో 25 నాటికల్ మైళ్లకు మించి వెళ్లలేకపోతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో, వారికి ఫిషరీస్ యూనివర్సిటీ ద్వారా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి, తగిన మౌలిక సదుపాయాలు, పరికరాలు అందిస్తే బంగాళాఖాతంలో మరింత దూరం వెళ్లి భారీ మొత్తంలో చేపల వేట సాగించేందుకు వీలు కలుగుతుందని తెలిపారు.

ఏపీ తీర ప్రాంతంలో దొరికే నెమలి కొమ్ముకోణం చేపకు కొరియా, జపాన్ దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉందని, అయితే 8 నుంచి 10 అడుగుల పొడవుతో 2 టన్నుల వరకు బరువు తూగే ఈ చేపలను పట్టేందుకు రాష్ట్ర మత్స్యకారుల వద్ద తగిన మెళకువలు లేవని వెల్లడించారు. మత్స్యకార విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి ఇలాంటి అంశాలపై సమగ్ర శిక్షణ ఇవ్వడం ద్వారా ఉత్పాదన మరింత పెంచవచ్చని వివరించారు.

భారత్ లో వర్సిటీ ఏర్పాటుకు రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు దక్షిణ కొరియా సుముఖంగా ఉన్నట్టు తెలిసిందని వెల్లడించారు. వర్సిటీకి 600 నుంచి 1000 ఎకరాలు అవసరం అనుకుంటే గొల్లపాలెం వద్ద భూములు అందుబాటులో ఉన్నాయని రఘురామ తెలిపారు. ప్రధాని నాయకత్వంలోనే ఈ వర్సిటీ ఏర్పాటు జరగాలని బలంగా కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.