UK: 12-15 ఏళ్ల వయసు వారిలోనూ ఫైజర్‌ టీకా పనిచేస్తోంది: బ్రిటన్‌ రెగ్యులేటరీ సంస్థ

  • సురక్షితమేనని తేల్చిన క్లినికల్‌ ట్రయల్స్‌
  • పంపిణీపై జేసీవీఐ తుది నిర్ణయం
  • అమెరికాలో ఈ వర్గానికి ఇప్పటికే అందుబాటులోకి టీకా
  • ఫ్రాన్స్‌, జర్మనీలో వచ్చే నెల నుంచి ఇచ్చేందుకు సన్నాహాలు
  • ఇంకా కొన్ని దేశాలు టీకాల కొరతతో సతమతం
Britain regulatory approved Pfizer vaccine for 12 to 15 age group

బయోఎన్‌టెక్‌-ఫైజర్‌ సంయుక్తంగా రూపొందించిన కరోనా టీకాను 12-15 ఏళ్ల మధ్య వయసు వారికీ ఇచ్చేందుకు బ్రిటన్‌ ఔషధ నియంత్రణా సంస్థ ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఈ వయసు వారికి ఈ టీకా ఇచ్చేందుకు అమెరికా సీడీసీతో పాటు ఐరోపా సమాఖ్యకు చెందిన రెగ్యులేటరీ సంస్థ సైతం అత్యవసర అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, 12-15 ఏళ్ల వయసు వారికి టీకా ఇచ్చే అంశాన్ని ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో చేర్చాలా? లేదా? అన్నది జాయింట్‌ కమిటీ ఆన్‌ వ్యాక్సినేషన్‌ అండ్‌ ఇమ్యునైజేషన్‌(జేసీవీఐ) స్వేచ్ఛకు వదిలేస్తున్నట్లు స్పష్టం చేసింది.

12-15 ఏళ్ల వయసు వారిపై నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్స్ ఫలితాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లు యూకే మెడిసిన్స్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొడక్ట్స్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జూనే  రైన్‌ వెల్లడించారు. ఈ వయసు వారికి ఈ టీకా సురక్షితమేనని తేల్చామని తెలిపారు. దీని వల్ల తలెత్తే దుష్ప్రభావాల కంటే ప్రయోజనాలే అధికమని స్పష్టం చేశారు.

అమెరికాలో ఇప్పటికే 12-15 ఏళ్ల వయసు వారికి ఫైజర్‌ టీకా అందజేస్తున్నారు. వచ్చే నెల నుంచి ఫ్రాన్స్‌, జర్మనీలోనూ ఈ వర్గానికి వ్యాక్సిన్‌ అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు టీకాల కొరతతో అనేక దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

More Telugu News