చైనా ఎదురుదాడి.... కరోనా వైరస్ అమెరికా ల్యాబ్ లోనే పుట్టిందని ఆరోపణలు

04-06-2021 Fri 18:45
  • వుహాన్ ల్యాబ్ లోనే కరోనా పుట్టిందంటున్న అమెరికా
  • మండిపడుతున్న చైనా
  • ఫోర్ట్ డెట్రిక్ ల్యాబ్ పై ఆరోపణలు ఉన్నాయని వెల్లడి
  • డబ్ల్యూహెచ్ఓ దర్యాప్తుకు అంగీకరించాలని డిమాండ్
China counters US on corona virus origin of birth

కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ లో రూపుదిద్దుకున్నదేనని అమెరికా సహా అనేక దేశాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో, ఆసియా అగ్రరాజ్యం చైనా ఎదురుదాడికి దిగింది. కరోనా వైరస్ కు పుట్టినిల్లు అమెరికానే అని ప్రత్యారోపణలు చేసింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్సిన్ అమెరికాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికాకు చెందిన ఫోర్ట్ డెట్రిక్ ల్యాబొరేటరీపై అనేక ఆరోపణలు ఉన్నాయని, డబ్ల్యూహెచ్ఓ తనిఖీలకు అమెరికా అనుమతించాలని డిమాండ్ చేశారు.

గతంలో తమపై ఆరోపణలు వచ్చినప్పుడు డబ్ల్యూహెచ్ఓ దర్యాప్తుకు సహకరించామని, ఇప్పుడు అమెరికా కూడా డబ్ల్యూహెచ్ఓ నిపుణులతో దర్యాప్తుకు ముందుకు రావాలని వెన్సిన్ స్పష్టం చేశారు. తద్వారా కరోనా వైరస్ మూలాలు ఎక్కడివన్న అంశాన్ని నిగ్గు తేల్చాలని అన్నారు. అమెరికాలోని ఫోర్ట్ డెట్రిక్ ల్యాబ్ సహా ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కరోనా వైరస్ ఉత్పన్నమైనట్టు పలు రిపోర్టులు చెబుతున్నాయని వెన్సిన్ పేర్కొన్నారు.

ఇటీవల కాలంలో అమెరికా మీడియాతో పాటు నిపుణులు చైనాపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ప్రపంచానికి కరోనా గురించి తెలియకముందే వుహాన్ లోని వైరాలజీ ల్యాబ్ లో పలువురు సిబ్బంది అస్వస్థతకు గురయ్యారని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ పేర్కొనడమే కాకుండా, ఆ సిబ్బంది మెడికల్ రికార్డులు వెల్లడి చేయాలని చైనాను డిమాండ్ చేశారు.

అదే సమయంలో అమెరికా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ భారీ కథనాన్ని ప్రచురించింది. 2019 నవంబరుకు ముందే వుహాన్ ల్యాబ్ నుంచి కొందరు ఆసుపత్రి పాలయ్యారని వెల్లడించింది. అమెరికా గోప్యంగా ఉంచిన నివేదికలో వుహాన్ ల్యాబ్ లో కరోనా మూలాలకు సంబంధించిన సమాచారం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే చైనా ప్రత్యారోపణలకు దిగినట్టు అర్థమవుతోంది.