'ప్రేమ్ కుమార్'గా సంతోష్ శోభన్ .. ఫస్టు లుక్ రిలీజ్!

04-06-2021 Fri 17:30
  • 'ఏక్ మినీ కథ'తో గుర్తింపు
  • నెక్స్ట్ మూవీ కొత్త దర్శకుడితో
  • కథానాయికగా రాశి సింగ్
  • 80 శాతం చిత్రీకరణ పూర్తి  
Prem Kumar movie first look poster release

సంతోష్ శోభన్ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి కొంతకాలమైంది. అయితే ఇంతవరకూ ఆయనకి సరైన హిట్ పడలేదు. తాజాగా ఓటీటీ ద్వారా వచ్చిన 'ఏక్ మినీ కథ' మాత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దాంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ హీరోపైనే ఉంది. ఇప్పటికే మూడు పెద్ద బ్యానర్లలో సినిమాలు చేయడానికి సంతోష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

ఇక ఆ సినిమాల కంటే ముందుగా సారంగ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ద్వారా అభిషేక్ మహర్షి అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సంతోష్ శోభన్ హీరోగా ఆయన 'ప్రేమ్ కుమార్' అనే సినిమాను చేస్తున్నాడు. ఇది కూడా పూర్తిగా వినోదభరితమైన కథాకథనాలతో నడిచేదే. రాశి సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఇంతవరకూ 80 శాతం చిత్రీకరణను జరుపుకుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి టైటిల్ తో కూడిన ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పెళ్లి కొడుకు గెటప్ లో ఉన్న హీరో .. ఒక చేతిలో తాళి .. మరో చేతిలో భూతద్దం పట్టుకుని కనిపిస్తున్నాడు. దీనిని బట్టే ఇది కామెడీ పాళ్లు ఎక్కువున్న సినిమా అనే విషయం అర్థమవుతోంది.