హైదరాబాదులో పలు ప్రాంతాల్లో వర్షం

04-06-2021 Fri 15:58
  • గత రెండ్రోజులుగా హైదరాబాదులో వర్షాలు
  • చల్లబడిన నగరం
  • నేడు కూడా వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం
  • మరికొన్నిరోజుల్లో తెలంగాణకు నైరుతి రుతుపవనాలు
 Rain poured in some parts of Hyderabad

వేసవి ఎండలతో అల్లాడిపోయిన హైదరాబాదు నగరం గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో చల్లబడింది. ఇవాళ కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. చిక్కడపల్లి, చింతల్, రాంనగర్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, భోలక్ పూర్, కవాడిగూడ, విద్యానగర్, జీడిమెట్ల, షాపూర్ నగర్, సూరారం, హకీంపేట, రామంతపూర్, ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి, అంబర్ పేట, కాచిగూడ, నల్లకుంట, వనస్థలిపురం, ఆటోనగర్, హయత్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్, మన్సూరాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురియడంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

కాగా, మరికొన్నిరోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ చేరుకోనున్నాయి. ఈసారి అంచనాలకు తగినట్టుగానే వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే వాతావరణ సంస్థలు ప్రకటించాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు కేరళలో అత్యధిక భాగంలోనూ, కర్ణాటక, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో పాక్షికంగా విస్తరించాయి.