దేశంలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు

04-06-2021 Fri 14:42
  • జూన్ 3న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
  • రెండ్రోజులు ఆలస్యమైన రుతుపవనాలు
  • కర్ణాటక, తమిళనాడు, ఏపీలోనూ ప్రవేశం
  • ఈ నెల 11న మహారాష్ట్రను తాకనున్న రుతుపవనాలు
Southwest monsoon advanced into some parts of southern India

రెండ్రోజులు ఆలస్యంగా జూన్ 3న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు దేశంలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. కేరళలోని మిగిలిన భాగాలు, దక్షిణ కర్ణాటక, ఉత్తర కర్ణాటకలోని పలు ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండీ వివరించింది.

కాగా, రేపటికి అరేబియా తీరం మొత్తం వ్యాపించడమే కాకుండా, ఏపీలోని రాయలసీమ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తాయని పేర్కొంది. సాధారణంగా మహారాష్ట్రకు జూన్ 7 నాటికి నైరుతి రుతుపవనాలు రావాల్సి ఉండగా, ప్రతికూల వాతావరణం కారణంగా ఈ నెల 11న రుతుపవనాలు మహారాష్ట్రను తాకుతాయని ఐఎండీ తెలిపింది.