Hanuman birth place: టీటీడీ అధికారులు తప్పులపై తప్పులు చేస్తున్నారు: గోవిందానంద సరస్వతి

  • హనుమాన్ జన్మస్థలంపై టీటీడీ చెప్పుతున్నవి నిజాలు కాదు
  • టీటీడీ అధికారులు క్షణానికి ఒక మాట మారుస్తున్నారు
  • హనుమంతుడి జన్మస్థలం గురించి టీటీడీ రాత్రికి రాత్రే కలగనిందా?
Visakha Sarada Peetam is duplicate says Govindananda Saraswathi

హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ చెప్పిన మాటలు పూర్తిగా అవాస్తవమని హనుమత్ జన్మతీర్థ ట్రస్ట్ వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చాలా హడావుడిగా టీటీడీ ప్రకటనను వెలువరించిందని విమర్శించారు. వారు చెపుతున్న మాటలు నమ్మదగినవి కాదని అన్నారు.

చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు టీటీడీ అధికారులు తప్పులపై తప్పులు చేస్తున్నారని చెప్పారు. తొలుత జపాలి తీర్థంలో హనుమంతుడు పుట్టాడని చెప్పారని... ఆ తర్వాత ఆకాశగంగ ప్రాంతంలో పుట్టాడని చెప్పారని... క్షణానికి ఒక మాట మార్చడం క్షమించలేని విషయమని అన్నారు.

టీటీడీ ఇప్పటికైనా శంకర, మధ్వ, రామానుజ తీర్థ మఠాల పెద్దలను సంప్రదించాలని గోవిందానంద సూచించారు. ఈ అంశంపై విశాఖ శారదాపీఠం సలహాలు ఇస్తోందనే వార్తలపై ఆయన స్పందిస్తూ... ఆ పీఠం ఒక డూప్లికేట్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం మద్దతు ఉన్నంత మాత్రాన విశాఖ పీఠం శంకర పీఠం అవుతుందా? అని మండిపడ్డారు. దక్షిణ భారతంలో తప్పుడు పీఠాలు ఉన్నాయని... ఇలాంటి పీఠాలను ఉత్తరాదిలో తరిమికొడతారని అన్నారు. శృంగేరి, బద్రి, ద్వారక, పూరి, కంచి పీఠాలు మాత్రమే శంకర పీఠాలని చెప్పారు. సన్యాసులు రాజకీయాల్లోకి రాకూడదని అన్నారు.

టీటీడీ ప్రచురించిన పుస్తకంలో పేర్కొన్న హనుమాన్ జయంతికి, ఇప్పుడే నిర్వహిస్తున్న తేదీలకు పొంతనే లేదని గోవిందానంద విమర్శలు గుప్పించారు. హనుమంతుడి జన్మస్థలం గురించి టీటీడీ రాత్రికి రాత్రే కలగనిందా? అని ప్రశ్నించారు. టీటీడీ తప్పు చేసిందని, ఇప్పటికైనా అహంకారాన్ని వదలాలని.. లేకపోతే పరువు పోతుందని హెచ్చరించారు. తప్పు ఒప్పుకుంటే పరువు పోతుందని టీటీడీ అధికారులు తప్పు మీద తప్పు చేస్తున్నారని అన్నారు. నిజాలను చెప్పకుండా టీటీడీ... భక్తులను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు.

More Telugu News