ఈటల లాంటి నాయకుడు బీజేపీకి అవసరం: రాజాసింగ్

04-06-2021 Fri 13:19
  • బీజేపీలో కూడా గ్రూపు రాజకీయాలు ఉన్నాయి
  • తెలంగాణలో బలపడాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది
  • ఈటల ఒక బలమైన బీసీ నేత
BJP needs leaders like Etela Rajender says Raja Singh

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరితే... పార్టీలోని కొందరు పార్టీని వీడే అవకాశం ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి చేరికలను వ్యతిరేకిస్తే వాళ్లకే నష్టమని చెప్పారు. అన్ని పార్టీల్లో ఉన్నట్టే బీజేపీలో కూడా గ్రూపు రాజకీయాలు ఉన్నాయని... అయితే బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పార్టీలో స్థానం లేదని అన్నారు. బీజేపీ ఎవరి సొంతం కాదని... పార్టీ చేరికలపై నిర్ణయం తీసుకునేది పార్టీ హైకమాండ్ మాత్రమేనని చెప్పారు.

తెలంగాణలో బలపడాలని తమ పార్టీ అధిష్ఠానం కృషి చేస్తోందని... ఈ తరుణంలో పార్టీలోకి ఈటల రావడం పార్టీకే బలమని రాజాసింగ్ చెప్పారు. ఈటల బీజేపీలో చేరితే పార్టీకి చాలా లాభిస్తుందని అన్నారు. బీసీ సామాజికవర్గంలో ఈటల ఒక బలమైన నాయకుడని... అలాంటి నేత బీజేపీకి అవసరమని చెప్పారు.