ప్రేమించ‌ట్లేద‌ని అమ్మాయిని క‌త్తితో పొడిచి చంపిన యువ‌కుడు.. అత‌డిని కొట్టి చంపిన స్థానికులు

04-06-2021 Fri 12:07
  • చిత్తూరు జిల్లా సాంబయ్య కండ్రిగలో ఘ‌ట‌న‌
  • యువతిని వేధిస్తోన్న‌ చిన్నా అనే యువ‌కుడు
  • పోలీసు కేసు పెట్టిన యువ‌తి కుటుంబ స‌భ్యులు
  • యువ‌తి ఇంటికెళ్లి దాడి చేసిన యువ‌కుడు
man kills girl in chittoor

త‌న‌ను ప్రేమించ‌ట్లేద‌ని ఓ అమ్మాయిని క‌త్తితో పొడిచి హ‌త్య చేశాడో యువ‌కుడు. అనంత‌రం గొంతు కోసుకుని ఆత్మ‌హ‌త్యాయత్నం చేశాడు. అత‌డిని స్థానికుడు బండ‌రాళ్ల‌తో కొట్టి చంపారు. ఈ ఘ‌ట‌న చిత్తూరు జిల్లా సాంబయ్య కండ్రిగలో చోటు చేసుకుంది.

ఆ గ్రామానికి చెందిన యువతిని చిన్నా అనే యువ‌కుడు ప్రేమ‌పేరుతో కొంత కాలంగా వేధిస్తున్నాడు. త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని కోరుతూ వెంట‌ప‌డుతున్నాడు. త‌న‌కు  ఇష్టం లేద‌ని చెప్పినా వినిపించుకోకుండా త‌న‌నే పెళ్లి చేసుకోవాల‌ని ఒత్తిడి తీసుకొస్తున్నాడు.  

దీంతో ఇటీవల పోలీసులకు ఆ యువ‌తి కుటుంబ స‌భ్యులు ఫిర్యాదు చేశారు. ఈ నేప‌థ్యంలో ఆ అమ్మాయిపై మ‌రింత ఆగ్ర‌హంతో ఊగిపోయిన చిన్నా ఈ రోజు ఉద‌యం ఆ యువతి ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. ఆమె ర‌క్త‌పు మ‌డుగులో పడి ప్రాణాలు కోల్పోయింది.  యువకుడు కూడా ఆత్మ‌హ‌త్యయ‌త్నం చేయ‌గా, అత‌డిని స్థానికులు కొట్టి చంపారు.

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న‌ పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. తాము ఫిర్యాదు చేసిన‌ప్ప‌టికీ పోలీసులు స‌రైన స‌మ‌యంలో చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ఆ యువ‌తి కుటుంబ స‌భ్యులు మండిప‌డ్డారు. అందుకే ఆ యువ‌కుడు రెచ్చిపోయాడ‌ని, త‌మ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.