విష్వక్సేన్ సరసన నలుగురు హీరోయిన్లు!

04-06-2021 Fri 10:36
  • మాస్ హీరోగా విష్వక్సేన్
  • రిలీజ్ కి సిద్ధంగా 'పాగల్'
  • ఎ.ఎల్.విజయ్ తో హారర్ మూవీ
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు  
Four heroins are acting with Vishwak Sen

తెలుగులో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ ముందుకు వెళుతున్న యువ కథానాయకులలో విష్వక్సేన్ ఒకరుగా కనిపిస్తాడు. ఆ మధ్య 'హిట్' సినిమాతో హిట్ కొట్టేసిన విష్వక్, 'పాగల్' సినిమాతో పలకరించడానికి రెడీ అవుతున్నాడు. నరేశ్ కుప్పిలి అనే నూతన దర్శకుడితో చేసిన ఈ సినిమా, కరోనా ప్రభావం తగ్గగానే థియేటర్స్ లో దిగడానికి సిద్ధంగా ఉంది. ఆ తరువాత కూడా ఈ మాస్ హీరో ఓ రెండు మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టేసినట్టుగా చెప్పుకుంటున్నారు.

ఆ సినిమాల్లో 'అక్టోబర్ 31.. లేడీస్ నైట్' అనేది ఒకటి. హారర్ నేపథ్యంలో ద్విభాషా చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి ఎ. ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అందువల్లనే ఈ రెండు భాషల్లో పరిచయం ఉన్న కథానాయికలను తీసుకున్నారు. ఆ జాబితాలో మేఘ ఆకాశ్ .. నివేద పేతురాజ్ .. మంజిమా మోహన్ .. రెబ్బా మోనికా జాన్ కనిపిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుందని అంటున్నారు.