తెలంగాణ ఎంసెట్ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు

03-06-2021 Thu 21:27
  • జులై 5 నుంచి 9వ వరకు ఎంసెట్
  • ఈ నెల 10 వరకు దరఖాస్తు గడువు పెంపు
  • విద్యార్థుల విజ్ఞప్తుల మేరకేనన్న కన్వీనర్
  • ఇంతకుముందు రెండుసార్లు గడువు పెంపు
Telangana state EAMCET application deadline extended

తెలంగాణలో ఇటీవల ఎంసెట్ షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జూలై 5 నుంచి 9వ తేదీ వరకు మొత్తం 9 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ వారికి 5 సెషన్లు, అగ్రికల్చర్ ప్రవేశాలు కోరుకునే వారికి 3 సెషన్లు, ఒకవేళ అవసరమైతే మరో సెషన్ నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షలు జరుగుతాయి. అయితే, తెలంగాణ ఎంసెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే గడువును మరోసారి పెంచారు. ఎలాంటి అదనపు రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండా జూన్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

తొలుత మే 18తో గడువు ముగియగా, మే 26 వరకు పొడిగించారు. ఆపై దాన్ని జూన్ 3 వరకు పొడిగించారు. ఆ గడువు నేటితో ముగియగా, మరో వారం రోజులు పొడిగిస్తూ తాజా నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల నుంచి వస్తున్న అభ్యర్థనల మేరకే ఎంసెట్ దరఖాస్తు గడువును పెంచామని కన్వీనర్ వెల్లడించారు.