ఫాబి ఫ్లూ కొనుగోలు కేసు: భగత్ సింగ్ వ్యాఖ్యలను ప్రస్తావించిన గౌతమ్ గంభీర్

03-06-2021 Thu 19:57
  • ఢిల్లీలో ఫాబి ఫ్లూ ఔషధాన్ని పంపిణీ చేసిన గంభీర్
  • ఫాబి ఫ్లూ ఔషధాన్ని గంభీర్ ఎలా కొన్నారన్న కోర్టు
  • అనధికారికంగా కొనుగోలు చేశారన్న డ్రగ్ కంట్రోలర్
  •  ట్విట్టర్ లో తన మనోభావాలు వెల్లడించిన గంభీర్
Gautam Gambhir tweets Bhagat Singh quote

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న వేళ... బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ పలు రకాల సేవలు అందించారు. ఈ క్రమంలో ఆయన కరోనా చికిత్సలో ఉపయోగించే ఫాబి ఫ్లూ ఔషధాన్ని పెద్దమొత్తంలో కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా అందించారు.

ఈ అంశాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఔషధాల కొరత ఉన్న సమయంలో గంభీర్ అంతపెద్దమొత్తంలో ఫాబి ఫ్లూ ఎలా కొనుగోలు చేయగలిగాడని ప్రశ్నించింది. తాజా విచారణలో, గంభీర్ కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫాబి ఫ్లూ ఔషధాన్ని అనుమతుల్లేకుండానే కొనుగోలు చేసిందని ఢిల్లీ ఔషధ నియంత్రణ సంస్థ న్యాయస్థానానికి తెలియజేసింది.

ఈ నేపథ్యంలో, గంభీర్ ట్విట్టర్ లో స్పందించారు. "నేను మానవుడ్ని.... మానవాళి వేదన చెందుతుంటే నేను తట్టుకోలేను" అంటూ నాడు భగత్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. తద్వారా ప్రజల క్షేమం కోసమే తాను ఫాబి ఫ్లూ కొనుగోలు చేశానన్న తన మనోభావాలను ఈ విధంగా వెల్లడించారు.