ఇంగ్లండ్ చేరుకున్న భారత పురుష, మహిళా క్రికెట్ జట్లు

03-06-2021 Thu 17:39
  • నిన్న ముంబయి నుంచి బయల్దేరిన భారత జట్లు
  • లండన్ నుంచి సౌతాంప్టన్ పయనం
  • సౌతాంప్టన్ లో కఠిన క్వారంటైన్
  • జూన్ 18 నుంచి డబ్యూటీసీ ఫైనల్
  • న్యూజిలాండ్ తో తలపడనున్న టీమిండియా
  • ఇంగ్లండ్ తో మ్యాచ్ లు ఆడనున్న భారత మహిళలు
Indian men and women teams arrived England

గత రాత్రి ముంబయి నుంచి బయల్దేరిన భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు ఇంగ్లండ్ చేరుకున్నాయి. పురుషుల, మహిళల జట్ల సభ్యులు లండన్ విమానాశ్రయం నుంచి నేరుగా సౌతాంప్టన్ పయనమయ్యారు. ఈ నెల 18 నుంచి కోహ్లీ సేన సౌతాంప్టన్ లోనే న్యూజిలాండ్ తో వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ జట్టుతో 5 టెస్టుల సిరీస్ లో పాల్గొంటుంది.

అటు, టీమిండియా మహిళలు ఇంగ్లండ్ గడ్డపై ఒక టెస్టు, 3 వన్డేలు, పలు టీ20 మ్యాచ్ లు ఆడనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో, యూకే నిబంధనల ప్రకారం భారత పురుషుల, మహిళల జట్ల సభ్యులు సౌతాంప్టన్ లోనే క్వారంటైన్ పూర్తి చేసుకోనున్నారు. కాగా, ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత ఆటగాళ్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. 'ఇంగ్లండ్ చేరుకున్నాం' అంటూ జరగబోయే మ్యాచ్ లపై ఉత్సాహం ప్రకటించారు.