Sarita Bhadauria: ఎమ్మెల్యేని చూసి టీకా వేసే సిబ్బంది అనుకుని దాక్కున్న వృద్ధురాలు

  • ఉత్తరప్రదేశ్, చందన్ పూర్ లో ఆసక్తికర ఘటన
  • నియోజకవర్గంలో పర్యటించిన బీజేపీ మహిళా ఎమ్మెల్యే
  • వైద్య సిబ్బంది అనుకుని పరుగులు తీసిన వృద్ధురాలు
  • తాను డాక్టర్ ను కాదని వెల్లడించిన ఎమ్మెల్యే
  • బయటికి వచ్చినా వ్యాక్సిన్ తీసుకోని వృద్ధురాలు
 Woman hides behind a drum to avoid vaccination

దేశంలో ఇప్పటికీ కరోనా వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో అపోహలు ఉన్నాయి. వ్యాక్సిన్ డోసులు తీసుకునేందుకు చాలా ప్రాంతాల్లో ప్రజలు సుముఖత చూపడంలేదు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ లో ఆసక్తికర సంఘటన జరిగింది. ఎమ్మెల్యేని చూసి టీకా వేసే ఆరోగ్య సిబ్బందిగా భావించిన ఓ వృద్ధురాలు భయపడి దాక్కుంది. బీజేపీ ఎమ్మెల్యే సరితా భదౌరియా ఇటావా నియోజకవర్గంలోని చందన్ పూర్ గ్రామంలో వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించేందుకు పర్యటించారు.

అయితే, హరిదేవి అనే 80 ఏళ్ల వృద్ధురాలు మహిళా ఎమ్మెల్యేని చూసి టీకా వేసే బృందంలో ఒకరిగా భావించి, ఓ తలుపు వెనుక దాగింది. ఆ తర్వాత అక్కడ్నించి పరిగెత్తి ఓ డ్రమ్ము వెనక దాక్కుంది. ఇది గమనించిన ఎమ్మెల్యే సరితా భదౌరియా, తాను టీకా వేయడానికి రాలేదని చెప్పారు. తాను డాక్టర్ ను కాదని, ప్రజలతో మాట్లాడ్డానికే వచ్చానని నచ్చజెప్పారు. దాంతో హరిదేవి డ్రమ్ము వెనుక నుంచి ఇవతలికి వచ్చింది.

అయితే ఎమ్మెల్యేతో మాట్లాడింది కానీ, వ్యాక్సిన్ వేయించుకునేందుకు మాత్రం ససేమిరా అంది. హరిదేవి మాత్రమే కాదు, యూపీలో ఇలాంటివాళ్లు చాలామందే ఉన్నారు. యూపీ జనాభాలో కేవలం 2 శాతం మాత్రమే వ్యాక్సిన్ పొందినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

More Telugu News