ఫైజర్‌, మోడెర్నా సంస్థలకు ఆ భద్ర‌త క‌ల్పిస్తే మాకూ క‌ల్పించాలి: సీరం డిమాండ్

03-06-2021 Thu 12:43
  • ఆర్థిక, చ‌ట్ట‌ ప‌ర‌మైన భద్ర‌త క‌ల్పించాలని ఫైజ‌ర్, మోడెర్నా విన‌తి
  • ఆ హామీ మిగ‌తా అన్ని సంస్థ‌ల‌కూ ఇవ్వాల‌న్న సీరం
  • ప్ర‌తికూల ప్ర‌భావాలు త‌లెత్తితే బాధ్యులను చేయబోమని హామీ కోరుతోన్న సంస్థ‌లు

భార‌త్‌కు త‌మ‌ వ్యాక్సిన్లను అందించాలంటే ఆర్థిక, చ‌ట్ట‌ ప‌ర‌మైన భద్ర‌త క‌ల్పిస్తామ‌ని హామీ ఇవ్వాల‌ని అమెరికాకు చెందిన ఫైజర్‌, మోడెర్నా సంస్థలు ఇప్ప‌టికే భార‌త్‌ను కోరాయి. ఇప్పుడు దేశీయ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ కూడా అదే డిమాండ్ ను లేవ‌నెత్తింది. త‌మ‌కు కూడా ఆర్థిక, చ‌ట్ట‌ ప‌ర‌మైన భద్ర‌త కల్పించాల‌ని చెప్పింది. అన్ని సంస్థ‌ల‌కూ ఒకే ర‌క‌మైన నిబంధ‌న‌లు ఉండాల‌ని సీరం అంటోంది.

ఒక‌వేళ విదేశీ సంస్థ‌ల‌కు ఆర్థిక, చ‌ట్ట‌ప‌ర‌మైన భద్ర‌త క‌ల్పిస్తే సీరం సంస్థ‌తో పాటు ఇత‌ర అన్ని వ్యాక్సిన్ సంస్థ‌ల‌కూ ఆ భ‌ద్ర‌త క‌ల్పించాలని సీరం వ‌ర్గాలు డిమాండ్ చేశాయి. వ్యాక్సిన్ల వల్ల భార‌త్‌లో ప్రతికూల ప్రభావాలు త‌లెత్తితే చ‌ట్ట‌ప‌ర‌మైన‌ చిక్కులతో పాటు ఆర్థికంగా నష్ట పరిహారాల అంశాలకు టీకా సంస్థలను బాధ్యులను చేయబోమంటూ స‌ర్కారు భ‌ద్ర‌త క‌ల్పించాల్సి ఉంటుంది.

దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్ర‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. అయితే, ఆ భద్ర‌త క‌ల్పించేందుకు తాము సిద్ధ‌మేనంటూ కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు అంటున్నాయి. ఫైజర్‌, మోడెర్నాల సంస్థ‌లు దేశంలో త‌మ వ్యాక్సిన్ల‌ అత్యవసర వినియోగ అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకుంటే ఆ సంస్థలకు అనుమతి ఇస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెప్పాయి.

ఇప్పటికే అమెరికాతో పాటు ప‌లు దేశాలు ఆయా సంస్థ‌ల‌కు రక్షణ క‌ల్పిస్తూ హామీ  ఇచ్చాయ‌ని తెలిపాయి.  కాగా, దేశంలో టీకాల కొర‌త నేప‌థ్యంలో ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం విదేశీ వ్యాక్సిన్ల సంస్థ‌ల‌కు ప‌లు మినహాయింపులు కల్పించింది.

ప‌లు దేశాల్లో అనుమ‌తులు పొంది వినియోగిస్తోన్న వ్యాక్సిన్ల‌ను భార‌త్‌లో వినియోగించ‌డానికి మ‌ళ్లీ ఇక్క‌డ క్లినికల్‌ ట్రయల్స్ నిర్వహించాల్సిన అవ‌స‌రం లేద‌ని, విడ‌త‌ల‌ వారీగా కేంద్ర ల్యాబ్‌ల‌లో చేపట్టాల్సిన ప‌రీక్ష‌ల‌ నుంచి కూడా మినహాయింపు ఇస్తున్న‌ట్లు తెలిపింది.