బాలకృష్ణతో అనిల్ రావిపూడి ప్రాజెక్టు ఖాయమైనట్టే!

03-06-2021 Thu 11:49
  • 'ఎఫ్ 3' పనుల్లో అనిల్ రావిపూడి
  • తదుపరి షెడ్యూల్ కి సన్నాహాలు
  • తరువాత సినిమా బాలకృష్ణతో
Anil Ravipudi another movie with Balakrishna

అనిల్ రావిపూడి వరుస సినిమాలతో.. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన 'ఎఫ్ 3' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే కొంతవరకూ షూటింగు జరుపుకున్న ఈ సినిమా, కరోనా కారణంగా ఆగింది. త్వరలోనే మళ్లీ సెట్స్ పైకి వెళ్లడానికి అవసరమైన సన్నాహాలు చేసుకుంటున్నారు. అనిల్ రావిపూడి ఆ తరువాత సినిమాను బాలకృష్ణతో చేయనున్నట్టుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి .. అది నిజమేనని తెలుస్తోంది. అందుకు సంబంధించిన సన్నాహాలు త్వరలో మొదలుకానున్నాయని అంటున్నారు.

బాలకృష్ణ - అనిల్ రావిపూడి సినిమాను 'షైన్ స్క్రీన్' బ్యానర్ వారు నిర్మిస్తున్నట్టుగా తెలుస్తోంది. 'మజిలీ' .. 'టక్ జగదీశ్' సినిమాలను నిర్మించిన ఈ బ్యానర్ .. తొలిసారిగా బాలకృష్ణతో భారీ సినిమాను ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 10వ తేదీన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ పోస్టర్ రావొచ్చని అంటున్నారు. 'అఖండ' షూటింగు పూర్తికాగానే బాలకృష్ణ, గోపీచంద్ మలినేనితో ఒక సినిమా చేయనున్నాడు. ఆ తరువాతనే ఆయన అనిల్ రావిపూడితో కలిసి సెట్స్ పైకి వెళ్లానున్నాడని అంటున్నారు.