ఓటీటీ వైపు వెళ్లనున్న మెగా హీరో మూవీ?

03-06-2021 Thu 11:08
  • సాయితేజ్ తాజా చిత్రంగా 'రిపబ్లిక్'
  • కరోనా కారణంగా వాయిదాపడిన రిలీజ్
  • కథానాయికగా ఐశ్వర్య రాజేశ్
  • పవర్ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ  
Republc movie will be released in OTT

కరోనా ప్రభావం తగ్గుతూ ఉండటంతో వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగులు మొదలుపెట్టాలనే ఆలోచనలో కొంతమంది దర్శక నిర్మాతలు ఉన్నారు. ఆల్రెడీ షూటింగు మొదలుపెట్టేసిన వాళ్లు పూర్తిచేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అయితే షూటింగులు మొదలుపెట్టినంత త్వరగా థియేటర్లు తెరుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. థియేటర్లకు జనం రావడానికి మరికొంత సమయం పట్టొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దాంతో అప్పటివరకూ వేచి చూడలేని సినిమాలు ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నాయి.

అలా ఓటీటీ వైపు వెళుతున్న సినిమాల జాబితాలో 'రిపబ్లిక్' కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. సాయితేజ్ కథానాయకుడిగా దర్శకుడు దేవ కట్టా ఈ సినిమాను రూపొందించాడు. నిజానికి ఈ నెల 4వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా ఎఫెక్ట్ కారణంగా వాయిదా పడింది. అందువలన ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఆ దిశగా చర్చలు నడుస్తున్నాయని అంటున్నారు. ఈ విషయంలో స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వెలువడవలసిందే. జగపతిబాబు .. రమ్యకృష్ణ కీలకమైన పాత్రలను పోషించిన సంగతి తెలిసిందే.