సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఆశ.. వరంగల్‌లో నకిలీ నోట్లు ముద్రిస్తూ చిక్కిన జంట

03-06-2021 Thu 09:43
  • అన్ని డినామినేషన్ల నోట్లు ముద్రణ
  • ప్రింటర్, స్కానర్ సాయంతో రూ. 10 లక్షల నకిలీ నోట్ల ముద్రణ
  • యూట్యూబ్‌లో చూసి దుకాణం మొదలుపెట్టిన దంపతులు
Warangal couple arrested for printing fake currency

వరంగల్‌ కాశీబుగ్గలోని తిలక్‌రోడ్డు ప్రాంతానికి చెందిన వంగరి రమేశ్ (55), సరస్వతి (45) దంపతులు వ్యాపారంలో నష్టపోవడంతో దాని నుంచి బయటపడేమార్గం కనిపించక దొంగనోట్ల ముద్రణను ఎంచుకున్నారు. స్కానర్, కలర్ ప్రింటర్ సాయంతో మూడు నెలలుగా అన్ని డినామినేషన్ల నోట్లను ప్రింట్ చేయడం మొదలుపెట్టారు. అనంతరం వాటిని స్థానిక దుకాణాల్లో చలామణి చేస్తూ సొమ్ము చేసుకునే ప్రయత్నం చేశారు.  

రమేశ్ చికెన్ సెంటర్ నిర్వహిస్తుండగా, సరస్వతి ఫ్యాన్సీ దుకాణం, మ్యారేజ్ బ్యూరో నడిపేవారు. అయితే, ఆర్థికంగా నష్టాలు రావడంతో వాటినుంచి బయటపడేందుకు నకిలీ నోట్ల ముద్రణను ఎంచుకున్నారు. యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల ముద్రణ గురించి తెలుసుకున్నారు. అనంతరం స్కానర్, ప్రింటర్, కరెన్సీ ముద్రణ కోసం బాండ్ పేపర్లు కొనుగోలు చేసి ముద్రణ ప్రారంభించారు.

నగరంలో నకిలీ నోట్ల చలామణి పెరగడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిఘా పెంచారు. పక్కా సమాచారంతో రమేశ్ ఇంటిపై దాడిచేసి వారిని అరెస్ట్ చేశారు.  వారి నుంచి మొత్తం రూ. 10,09,960 నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.