ఆమె నా భర్త గాళ్ ఫ్రెండ్ కాదు.. తెలిసిన వ్యక్తి.. అంతే!: మెహుల్ చోక్సీ భార్య స్పష్టీకరణ

03-06-2021 Thu 08:07
  • గాళ్ ఫ్రెండ్ వార్తలపై స్పందించిన చోక్సీ భార్య ప్రీతి
  • భారత్‌కు సజీవంగా రప్పించాలనుకున్నప్పుడు హింసించడం ఎందుకని ప్రశ్న
  • మానవహక్కుల ఉల్లంఘనేనని ఆవేదన
Mehul Choksi Wife slams Dominica and Antigua authorities
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో విదేశాలకు చెక్కేసి ఇటీవల డొమినికాలో పట్టుబడిన మెహుల్ చోక్సీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. చోక్సీ తన గాళ్‌ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్తూ డొమినికాలో చిక్కినట్టు వార్తలు వచ్చాయి. అంటిగ్వా ప్రధాని కూడా ఇదే విషయం చెప్పారు. తాజాగా, ఈ వార్తలపై చోక్సీ భార్య ప్రీతి చోక్సీ స్పందించారు. ఆమె తన భర్తకు తెలిసిన వ్యక్తే తప్ప గాళ్ ఫ్రెండ్ కాదని స్పష్టం చేశారు. చోక్సీ అంటిగ్వాలో ఉన్నప్పుడు ఆయనతో కలిసి వాకింగ్ చేసేదని చెప్పారు. మీడియాలో చూపిస్తున్న మహిళ, తన భర్తతో వాకింగ్ చేసే మహిళ ఒకరు కాదని పేర్కొన్నారు.

డొమినికా జైలులో ఉన్న చోక్సీని హింసిస్తున్నారంటూ వస్తున్న వార్తలపైనా ప్రీతి స్పందించారు. ఇది పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘనేనన్నారు. ఆయనను సజీవంగా భారత్‌కు రప్పించాలనుకున్నప్పుడు ఇలా హింసించాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. తన భర్తకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, ఇలా హింసించడం తగదని అన్నారు. కాగా, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చోక్సీ మేనల్లుడు నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ జైలులో ఉన్నాడు.