Odisha: టీకాల విషయంలో.. ముఖ్యమంత్రులకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లేఖలు

  • ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు కేంద్రంతో కలిసి నడవాలి
  • టీకాలకు ప్రాధాన్యం ఇచ్చే వరకు ఏ రాష్ట్రమూ క్షేమం కాదు
  • టీకాల కొనుగోలు అంశం రాష్ట్రాల మధ్య చిచ్చుకు కారణం కాకూడదు
  • కేంద్రమే టీకాలు కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇవ్వాలి
Odish CM Naveen Patnaik Write letters to All CMs

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న కరోనా విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు కేంద్రంతో కలిసి నడుస్తూ సమాఖ్యవాద స్ఫూర్తిని చాటాలని కోరుతూ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. టీకాలకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చే వరకు ఏ రాష్ట్రమూ క్షేమకరం కాదని పేర్కొన్న పట్నాయక్.. వ్యాక్సిన్ల కొనుగోలు అంశం రాష్ట్రాల మధ్య చిచ్చుకు కారణం కాకూడదన్నారు. ప్రస్తుత పరిస్థితుల నుంచి ప్రజలను రక్షించేందుకు ఉన్న ఏకైక మార్గం టీకా ఒక్కటేనన్నారు. రాష్ట్రాలకు అవసరమయ్యే టీకాలను కేంద్రమే కొనుగోలు చేసి ఇవ్వాలన్నారు. స్వాతంత్య్రానంతరం దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఇదేనని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

టీకాల కోసం రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళ్లినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్న నవీన్ పట్నాయక్.. టీకాలను ఉత్పత్తి చేసే అంతర్జాతీయ సంస్థలు కేంద్రం అనుమతి లేకుండా పంపిణీ చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు. మరోవైపు, దేశీయ అవసరాలకు అనుగుణంగా దేశీయ సంస్థలు టీకాలను సరఫరా చేయలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి రాష్ట్రాలన్నీ కేంద్ర ప్రభుత్వంతో కలిసి నడవాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాక్సినేషన్ విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేయాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రాల టీకాల అవసరాలు తీర్చేందుకు కేంద్రమే వ్యాక్సిన్లను కొనుగోలు చేసి అందించాలని ఒడిశా సీఎం కోరారు.

More Telugu News