Mehul Choksi: భారత్ ప్రయత్నాలకు గండికొట్టే యత్నం.. డొమినికా ప్రతిపక్ష నేతకు భారీగా ముడుపులు సమర్పించిన చోక్సీ సోదరుడు?

  • హాంకాంగ్ నుంచి భారీ మొత్తంతో డొమినికాలో వాలిపోయిన చోక్సీ సోదరుడు
  • ప్రతిపక్ష నేత లెనాక్స్ లింటన్‌కు 2 లక్షల డాలర్లు
  • ఆరోపణలకు బలం చేకూర్చేలా లింటన్ వ్యాఖ్యలు
Mehul Choksis brother bribed Dominicas leader of opposition

పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మెహుల్ చోక్సీని డొమినికా నుంచి భారత్‌కు రప్పించే ప్రయత్నాలకు గండికొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. చోక్సీని భారత్‌కు పంపకుండా అడ్డుకునేందుకు గాను అక్కడి ప్రతిపక్ష నేతతో చోక్సీ సోదరుడు చేతన్ చోక్సీ కుమ్మక్కు అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా భారీగా ముడుపులు సమర్పించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

మెహుల్ చోక్సీని భారత్‌కు పంపడానికి సంబంధించి కోర్టులో విచారణ జరగడానికి ముందే చేతన్ చోక్సీ హాంకాంగ్ నుంచి నేరుగా భారీ మొత్తంతో డొమినికాలో వాలిపోయాడని, అక్కడి ప్రతిపక్ష నేత లెనాక్స్ లింటన్‌కు 2 లక్షల డాలర్లు ముట్టజెప్పాడని అక్కడి స్థానిక మీడియా పేర్కొన్నట్టు జాతీయ మీడియా తన కథనాల్లో పేర్కొంది.

ఆర్థిక నేరాల్లో నిందితులను అంతర్జాతీయ సరిహద్దులను దాటించేందుకు అవకాశం కల్పించడం సమర్థనీయం కాదని లింటన్ వ్యాఖ్యానించడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. డొమినికానే కాదు, అంటిగ్వాలోని ప్రతిపక్షాలు కూడా చోక్సీని భారత్‌కు అప్పగించరాదనే చెబుతున్నాయి. కాగా, చోక్సీని భారత్‌కు తిరిగి పంపడానికి సంబంధించి డొమినికా కోర్టు నేడు విచారణ జరుపుతోంది. పీఎన్‌బీ కుంభకోణంలో చోక్సీ నిందితుడని నిరూపించే ఆధారాలను డొమినికన్ కోర్టులో సమర్పించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది.

More Telugu News