Vijayawada: రెండు వారాల క్రితం భార్యకు అంత్యక్రియలు జరిపించిన భర్త.. నేడు తిరిగొచ్చిన భార్య!

  • కరోనాతో విజయవాడ ఆసుపత్రిలో చేరిన గిరిజమ్మ
  • ఆమె చనిపోయిందంటూ భర్తకు మృతదేహాన్ని అందించిన ఆసుపత్రి సిబ్బంది
  • ఈరోజు ఇంటికి తిరిగొచ్చిన గిరిజమ్మ
Wife return to home after funerals

ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన గిరిజమ్మ అనే మహిళ కరోనా కారణంగా విజయవాడ ఆసుపత్రిలో చేరారు. అయితే, ఆమె చనిపోయారంటూ మే 15న ఓ మృతదేహాన్ని ఆమె భర్తకు వైద్యులు అప్పగించారు. బాధాతప్త హృదయంతో ఆమెకు కుటుంబసభ్యులు అంత్యక్రియలను నిర్వహించారు. మే 23న  ఆమె కుమారుడు రమేశ్ కూడా కరోనాతో ఖమ్మం ఆసుపత్రిలో మృతి చెందాడు.

రెండు రోజుల క్రితమే తల్లి, కొడుకుకి కుటుంబసభ్యులు దశదినకర్మలను పూర్తి చేశారు. అయితే, ఈరోజు వారికి ఊహించని ఘటన ఎదురైంది. గిరిజమ్మ జగ్గయ్యపేటలోని తన ఇంటికి వచ్చింది. దీంతో అంతా షాక్ కు గురయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో ఆసుపత్రి సిబ్బందిపై కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు చనిపోయారో కూడా నిర్ధారించుకోకుండానే మరొకరి మృతదేహాన్ని ఎలా అప్పగిస్తారని ఆమె భర్త గడ్డయ్య మండిపడ్డారు. మరోవైపు గిరిజమ్మ రావడం కుటుంబసభ్యులకు సంతోషం కలిగించినప్పటికీ... కొడుకుని కోల్పోవడంతో గడ్డయ్య దంపతులు కంటతడి పెట్టుకుంటున్నారు. ఓవైపు ఆనందం, మరోవైపు విషాదం ఆ ఇంటిలో నెలకొంది.

More Telugu News