Madras: దురదృష్టం కొద్దీ భర్తలకు గృహ హింస చట్టం లేకుండాపోయింది: మద్రాస్​ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

  • పెళ్లి అనేది పవిత్రమైనదన్న జడ్జి
  • గృహ హింస చట్టంతో ఆ పవిత్రత పోయిందని కామెంట్
  • దంపతులు అహాన్ని చెప్పుల్లా చూడాలని సూచన
Unfortunately no Domestic Violence Act for husband to proceed against wife says Madras HC

గృహ హింస చట్టంపై మద్రాస్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భార్యపై తప్పుడు కేసు పెట్టడానికి వారిలాగా భర్తల కోసం గృహ హింస చట్టమంటూ ఒకటి లేకపోవడం దురదృష్టమంటూ వ్యాఖ్యానించింది. శశికుమార్ అనే వెటర్నరీ వైద్యుడు వేసిన రిట్ పిటిషన్ ను విచారించిన హైకోర్ట్ ధర్మాసనంలోని న్యాయమూర్తి జస్టిస్ ఎస్. వైద్యనాథన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

2015లో శశికుమార్ పై అతడి భార్య సేలంలోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కమ్ అదనపు మహిళా కోర్టులో గృహ హింస కేసు పెట్టింది. ప్రతిగా తన భార్యే తనను చిత్రహింసలు పెట్టిందని, తనను వదిలేసి వెళ్లిపోయిందని ఫస్ట్ అడిషనల్ సబ్ జడ్జికి శశికుమార్ ఫిర్యాదు చేశారు. విడాకులు రావడానికి నాలుగు రోజుల ముందు యానిమల్ హస్బెండ్రీ అండ్ వెటర్నరీ సర్వీసెస్ డైరెక్టర్ కూ తన భర్తపై ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది. దీంతో ఆయన శశికుమార్ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ 2020 ఫిబ్రవరి 28న ఉత్తర్వులిచ్చారు. ఆ మర్నాడే దంపతులకు కోర్టు విడాకులు మంజూరు చేసింది.

సస్పెన్షన్ ఆర్డర్ పై గత ఏడాది శశికుమార్ హైకోర్టుకెళ్లారు. ఆ కేసు తాజాగా విచారణకు రావడంతో జస్టిస్ వైద్యనాథన్.. పిటిషనర్ ను కావాలనే ఇబ్బందులకు గురిచేసినట్టుందని అన్నారు. విడాకులు వస్తాయని ముందే తెలిసీ ఆమె ఇలా ఫిర్యాదు చేసినట్టు అర్థమవుతోందన్నారు. భార్యాభర్తలు తమ అహాన్ని పాదరక్షల్లా చూడాలని, ఇంటి బయటే దానిని వదిలేసి రావాలని సూచించారు. లేదంటే దాని ఫలితాన్ని పిల్లలు అనుభవించాల్సి వస్తుందన్నారు.

ఓ వ్యక్తి జీవితంలో పెళ్లి అనేది పవిత్రమైన కార్యమని అన్న ఆయన.. తలపాగాను తీసేసినంత ఈజీగా బంధాన్ని తెంచుకోవద్దన్నారు. అయితే, సహ జీవనానికి హక్కు కల్పించిన గృహ హింస చట్టం 2005 అమల్లోకి వచ్చినప్పటి నుంచి ‘పవిత్రత’ అన్న పదానికి అర్థం లేకుండాపోయిందని అన్నారు. శశికుమార్ ను 15 రోజుల్లోగా విధుల్లోకి తీసుకోవాలని యానిమల్ హస్బెండ్రీ డైరెక్టర్ ను జస్టిస్ వైద్యనాథన్ ఆదేశించారు.

More Telugu News